
నన్ను క్షమించండి..నాలుగు పేజీల లేఖ
హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు తుదితీర్పు అనంతరం సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ...దోషులతో విడి విడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రామలింగరాజు అరగంట పాటు సుదీర్ఘంగా న్యాయమూర్తితో తన కేసు పరిస్థితిని విన్నవించుకున్నారు. తనను క్షమించాలని కోరుతూ ఆయన ... న్యాయమూర్తికి నాలుగు పేజీల లేఖను సమర్పించారు. ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి తప్పు చేయలేదని రామలింగరాజు ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపినట్లు సమాచారం.
108,104, భైర్రాజు, నాంది ఫౌండేషన్ల ద్వారా సమాజానికి ఎంతో సేవ చేశానని, తాను చేసిన సేవా కార్యక్రమాలను పక్క రాష్ట్రాలు కూడా అమలు చేశాయని ఆయన తెలిపారు. తన సేవలు గుర్తించి అయినా శిక్షను తగ్గించాలని కోరారు. పిల్లల బాధ్యత చూసుకోవాల్సి ఉందని, వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించాల్సి ఉందని ఆయన...న్యాయమూర్తికి తెలిపారు. 33 నెలల జైలు శిక్ష కాలంలో ఎంతో క్షోభను అనుభవించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఈకేసులో రామలింగరాజు సహా పదిమందిని దోషులుగా కోర్టు నిర్థారించిన విషయం తెలిసిందే. దోషులకు శుక్రవారం శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది.