ఈ–ములాఖత్‌తో సమయం ఆదా
⇒ ఖైదీల కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగకరం
⇒ ‘చంచల్‌గూడ’లో ఈ–ములాఖత్ ప్రారంభంలో హోం మంత్రి నాయిని
హైదరాబాద్: జైళ్లలోని ఖైదీలను కలిసేందుకు వచ్చే వారి కుటుంబ సభ్యులకు ఈ–ములాఖత్ ఎంతగానో ఉపయోగపడుతోందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ఆయన చంచల్‌గూడ జైల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఈ–ములాఖత్ సౌకర్యాన్ని ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఈ–ములాఖత్ పనితీరును జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ.. గతంలో ములాఖత్ కోసం వచ్చే వారు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని, ఈ–ములాఖత్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇంట్లోనే కూర్చుని ములాఖత్ నమోదు చేసుకోవచ్చని చెప్పారు. దేశంలో ఎక్కడి నుంచైనా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు. జెళ్ల శాఖ నిర్వస్తున్న పెట్రోల్ బంక్‌ల ద్వారా ఏటా రూ. 3 కోట్ల ఆదాయం వస్తోంద న్నారు. జైళ్లలో అవినీతిని రుజువు చేస్తే రూ. 5 వేల నగదు బహుమానం ఇస్తామని డీజీ వినయ్‌కుమార్ ప్రకటించారు. కార్యక్రమంలో డీఐజీ నర్సింహ, సూపరింటెండెంట్‌లు బచ్చు సైదయ్య, బషీరాబేగం తదితరులు పాల్గొన్నారు.
ఈ–ములాఖత్ నమోదు ఇలా..
ఖైదీలను ములాఖత్‌లో కలవాలం టే జైలు వద్ద ఉన్న ములాఖత్ నమోదు కేంద్రానికి వచ్చి ఆధార్ జిరాక్స్ అందజేస్తే ములాఖత్‌కు వచ్చే వారితో పాటు జైల్లో ఉన్న వ్యక్తి వివరాలు నమోదు చేసుకుని టోకెన్ నంబర్ ఇస్తారు. సూపరింటెండెంట్ లేదా డిప్యూటీ సూపరింటెండెంట్ ములాఖత్ ఫారమ్‌ను పరిశీలించి అనుమతి ఇస్తారు. దీనికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. సమయం వృథా కాకుండా ఉండేందుకు జైళ్ల శాఖ ఈ–ములాఖత్ ను ప్రవేశపెట్టింది. eprisons. nic. inలో new visit registration
ఆప్షన్‌లో ఆధార్ నంబర్‌తో పాటు ములాఖత్‌కు వచ్చే వారి, ఖైదీ వివరాలు నమోదు చేయాలి. తేదీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. రెండు మూడు గంటల వ్యవధిలో ములాఖత్ అనుమతించబడిందా లేక తిరస్కరించబడిందా తెలిసిపోతుంది. అనుమతించబడిన ములాఖత్ పాస్ ప్రింట్ తీసుకుని జైల్లోని ములాఖత్ కార్యాలయంలో అందజేస్తే సరిపోతుంది.