ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వాల కుట్ర
♦ చంద్రబాబు, కేసీఆర్ మోసం చేశారు: మంద కృష్ణ
♦ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలంటూ ధర్నా
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ ముందుకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా జనవరిలో యుద్ధం చేస్తామని హెచ్చరించారు. ఇక 14 ఏళ్ల ఉద్యమకాలంలో, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ నోటి నుంచి వ ర్గీకరణకు అనుకూలంగా ఒక్క మాట మాట్లాడలేదని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం కేసీఆర్ ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ.. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ జరిపితే... చీకట్లో ఉన్న మాదిగ జాతిలో వెలుగులు నిండుతాయన్నారు. తమది న్యాయమైన పోరాటం కావడం వల్లే అన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయని... రాంచందర్‌రావు కమిషన్, ఉషా మెహ్రా కమిషన్ నివేదికలు అనుకూలంగా వచ్చాయని చెప్పారు. చంద్రబాబు నుంచి చంద్రశేఖర్‌రావు వరకు మాదిగ ఉద్యమాన్ని దెబ్బతీసే, దళిత జాతిని మోసం కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్‌ను మాదిగలు వర్గీకరణపై నిలదీస్తే.. అవమానకరంగా మాట్లాడాడని, మాదిగ జాతిపై ఉన్న కక్ష, ద్వేషానికి అది నిదర్శనమని ఆరోపించారు.
కుట్రలు, కుతంత్రాలు, అణచివేత, కూల్చివేతలతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని బీజేపీ శాసనసభా పక్షనేత కె .లక్ష్మణ్ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ చెప్పారు. సామాజిక న్యాయం జరగాలని కాంగ్రెస్ తెలంగాణను ఇస్తే ఒక కుటుంబం అధికారంలో కూర్చుందని విమర్శించారు. వర్గీకరణకు అనుకూలం అంటూనే కేసీఆర్ మాదిగలను మోసం చేస్తున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, సీపీఎం నాయకుడు నర్సింహరావు, ఎంఎస్‌ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.