
ప్రేమ పేరుతో వంచన
ప్రేమ పేరుతో ఉపాధ్యాయురాలిని మోసం చేసేందుకు యత్నించిన స్కూలు మాజీ ఇన్‌చార్జిని బొల్లారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో నిందితుడు
బొల్లారం: ప్రేమ పేరుతో ఉపాధ్యాయురాలిని మోసం చేసేందుకు యత్నించిన స్కూలు మాజీ ఇన్‌చార్జిని బొల్లారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు మహిళలతోనూ ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా చాటింగ్ చేస్తూ ప్రేమ పేరుతో వల వేస్తున్నట్టు అతడి సెల్‌ఫోన్ డేటా ఆధారంగా గుర్తించారు. వివరాలు... బొల్లారం ఠాణా పరిధిలోని ప్రైవేటు పాఠశాలలో లోతుకుంటకు చెందిన యువతి (22) టీచర్‌గా పని చేస్తోంది. ఖమ్మంజిల్లా పాల్వంచకు చెందిన వాసిం అక్రం గతంలో ఈ పాఠశాలలో ఇన్‌చార్జిగా వ్యవహరించాడు.
ఇతను ఆ యువతికి ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని వల వేశాడు. వివాహం చేసుకుంటానని ఆమెను ఈనెల 4న ఖమ్మంలో ఉండే స్నేహితుడి ఇంటికి పంపాడు. అయితే, విధులకు వెళ్లిన కూతురు స్కూల్ నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ను సంప్రదించగా 4వ తేదీన ఆమెకు సెలవు ఇచ్చామని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సెల్‌ఫోన్ కాల్ డేటా, సిగ్నల్స్ ఆధారంగా వసీం అక్రంను అదుపులోకి తీసుకొని విచారించగా...యువతిని ఖమ్మంలో ఉండే తన మిత్రుడి ఇంటికి పంపానని చెప్పాడు.
తాను తర్వాత వస్తానని చెప్పి వ సీం నగరంలోనే ఉండిపోయాడని తేలింది. బొల్లారం పోలీసులు అక్కడి పోలీసుల సహాయంతో బాధిత టీచర్‌ను నగరానికి రప్పించారు. వసీం అక్రం ఇతర మహిళలకు కూడా ప్రేమ, పెళ్లి అంటూ ఫోన్ చాటింగ్ ద్వారా వల వేస్తున్నట్టు గుర్తించారు. మరింత వివరాలు రాబట్టేందుకు అతడిని విచారిస్తున్నారు.