సరస్వతీ నమస్తుభ్యం..
►మోగిన బడిగంట.. సర్కారు బడిలో సమస్యల స్వాగతం
►పిల్లలతోనే గదుల శుభ్రం
►పలు స్కూళ్లలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు
►సమాచారం లేక వెనుదిరిగిన విద్యార్థులు
సిటీబ్యూరో: సుధీర్ఘ వేసవి సెలవుల అనంతరం సోమవారం బడిగంట మోగింది. నిన్నమొన్నటి వరకు సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు తాజాగా పుస్తకాలను భుజాన వేసుకొని బడిబాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎప్పటిలాగే దుమ్ముపట్టిన బెంచీలు..కుర్చీలు, బూజు పట్టిన గదులు స్వాగతం పలుకాయి. వారే గదులను శుభ్రం చేసుకున్నారు. ఇక ప్రైవేటు స్కూళ్లు ‘వెల్‌కమ్.. బ్యాక్ టు స్కూల్’ బోర్డులతో ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులకు ఘనస్వాగతం పలికాయి. పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లే బస్సులు, ఆటోలతో పాటు తల్లిదండ్రులు సొంత వాహనాలతో రోడ్డెక్కడంతో రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది.
ఈదిబజార్, జీజీహెచ్‌ఎస్ ఫలక్‌నుమా, జీహెచ్‌ఎస్ కోట్ల అలిజా, జీహెచ్‌ఎస్ చాంద్రాయణగుట్ట, మైసారం, వహర్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాల, బోరబండ నాట్కో పాఠశాల, ఎన్‌బీటీ నగర్, ఎర్రమంజిల్ హైస్కూల్స్, వనస్థలిపురం, సాహెబ్‌నగర్ తదితర పాఠశాలల్లో ఉదయం టెన్త్ సప్లిమెంటర్ పరీక్షలు జరిగాయి. ఈ విషయం తెలియక ఉదయమే స్కూలుకు చేరు కున్న విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు.
సమస్యల స్వాగతం..
ఎంసీహెచ్ క్వార్టర్స్‌లోని బౌలి గులాబ్‌సింగ్ హైస్కూల్ వరండా పూర్తిగా చెత్తాచెదారం, బీరు బాటిళ్లతో నిండిపోయింది. తరగతి గదులలో వర్షపునీరు చేరింది. టేబుళ్లు, కుర్చీలు దుమ్ముపట్టి దర్శనిమిచ్చాయి. పాఠశాలలో 55 మంది విద్యార్థులు ఉండగా, తొలి రోజు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. డోర్‌బస్తీలోని ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ మరాఠి మీడియం పాఠశాలలో బాత్‌రూమ్‌లు శిధిలావస్థకు చేరాయి. పైకప్పు నుంచి వర్షపునీరు కారుతోంది.పాతబస్తీలోని రియాసత్‌నగర్ డివిజన్‌లోని దర్గా బర్హానే షా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గదులను విద్యార్థులతో కడిగించారు. ఉదయాన్నే పాఠశాలకు విచ్చేసిన విద్యార్థులకు చీపుర్లు, నీటి డబ్బాలు, డస్టర్లు ఇచ్చి పనిచెప్పారు.
గౌలిపురా అయోధ్యనగర్‌లోని జీబీహెచ్‌ఎస్ శాలిబండ పాఠశాలలో బెంచీలు లేకపోవడంతో విద్యార్థులు నేలపై కూర్చుకున్నారు.పురానాపూల్‌లోని ప్రభుత్వ హిందీ పాఠశాల గేటు తాళాలు ఉదయం 9 గంటల వరకు తీయకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు వర్షంలో తడవాల్సి వచ్చింది.గొల్లకిడికిలోని గ్యాబ్రిల్ చారిటబుల్ స్కూల్‌లో అనేక మంది విద్యార్థులు ఉన్నప్పటికీ.. సరైన సౌకర్యం లేకపోవడంతో మెట్లపైన కూర్చోవాల్సి వచ్చింది.వనస్థలిపురం కమలానగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో రికార్డు ప్రకారం 40 మంది విద్యార్థులు ఉండగా.. ఉదయం 9.30 వరకు ఒక్క విద్యార్థి కూడా హాజరు కాలేదు.
ఎల్‌బీనగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో అటెండర్ లేకపోవడంతో విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడే గంట కొట్టారు.నేరేడ్‌మెట్ పాఠశాలలో సుమారు 80 మంది విద్యార్థులకుగాను సుమారు 30 మంది, వాజ్‌పేయినగర్‌లో 130 మందికి సుమారు 50 మంది విద్యార్థులు హాజరయ్యారు.మల్కాజిగిరి, ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని పాఠశాలల్లో తొలిరోజు ఉదయం ప్రార్థన (8.45) సమయానికి ఉపాధ్యాయుల్లో చాలా మంది హాజరు కాలేదు. ఆసిఫ్‌నగర్ మండలం గోల్కొండ జోన్ పరిధిలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యావలంటీర్లు ఆలస్యంగా పాఠశాలకు చేరుకున్నారు.