ఎమ్మెల్యే అభ్యర్థులను వెతుక్కోండి
సీమాంధ్ర ఎంపీ అభ్యర్థులకు దిగ్విజయ్ సూచన
ఎన్నికలు, మేనిఫెస్టో, ప్రచార కమిటీ నేతలతో భేటీ
సిట్టింగ్‌లందరికీ సీట్లు కేటాయిస్తామని హామీ
‘ప్యాకేజీ’ని ప్రజల్లోకి తీసుకెళ్లండి
పార్టీ కష్టాల్లో ఉంది..కలసికట్టుగా వెళ్లండి
సాక్షి, హైదరాబాద్:‘‘పార్టీ కష్టాల్లో ఉంది. అన్ని స్థానాల్లో పోటీకి అభ్యర్థులుండేలా చూసుకోవాలి. లేదంటే తప్పుడు సంకేతాలు వెళ్లి మిగతా నియోజకవర్గాలపై కూడా వ్యతి రేక ప్రభావం పడుతుంది. అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు కరువైనచోట ఇతర వర్గాల్లో పేరు ప్రతిష్టలున్న వారిని గుర్తించి పోటీకి ఒప్పించాలి’’ అని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు సూచించారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో పార్టీలో ఉన్న వారందరికీ టిక్కెట్లు ఇస్తామని చెప్పారు.
175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి అభ్యర్థులను సిద్ధం చేయాల్సిన బాధ్యత ఎంపీ అభ్యర్థులకే వదిలి పెడుతున్నట్లు తెలిపారు. ఎవరి నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులను వారే సూచించాలని చెప్పారు. నూతనంగా ఏర్పడిన ఏపీసీసీ ఎన్నికలు, మేనిఫెస్టో, ప్రచార కమిటీల సమావేశాలకు శనివారం దిగ్విజయ్ అధ్యక్షత వహించి మాట్లాడారు. సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్రమంత్రు లు చిరంజీవి, పల్లంరాజు, కోట్లసూర్యప్రకాశ్‌రెడ్డి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో సీమాంధ్రలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయని, నేతలంతా కష్టపడితే ప్రభుత్వాల ఏర్పాటులో మనమే కీలకపాత్ర పోషిస్తామని దిగ్విజయ్ నేతలకు సూచించారు. సీమాంధ్ర ప్రాంతానికి ఇచ్చిన ప్యాకేజీల గురించి గట్టిగా ప్రచారం చేయాలన్నారు. అందరూ కలసికట్టుగా వెళ్తేనే కొంతైనా ఫలితం ఉంటుందని చెప్పారు. అయితే సమావేశంలో పాల్గొన్న నేతలు దిగ్విజయ్ వ్యాఖ్యలతో ఏకీభవించలేదు.
విభజన నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయ్యిందని, కనీసం పోటీచేసేందుకు కూడా అభ్యర్థులు కనిపించడం లేదని పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తదితరులు పేర్కొన్నట్లు సమాచారం. తమ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల్లలో పార్టీ అనామకులెవరినో పోటీకి పెడితే తాము ఇబ్బందుల పాలవుతామని, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక బాధ్యత తమకే వదిలేయాలని పనబాక లక్ష్మి కోరగా దిగ్విజయ్ అంగీకరించారు. తెలంగాణపై కాంగ్రెస్‌పార్టీ, కేంద్రం చివర్లో హడావుడి నిర్ణయం చేయడం వల్లనే సీమాంధ్రలో పార్టీ నష్టపోయిందని పల్లంరాజు ఆవేదన వ్యక్తపరిచారు. అధిష్టానం అన్ని విషయాల్లోనూ తప్పుడు నిర్ణయాలే తీసుకుందని, రెండు ప్రాంతాల్లోనూ పార్టీ నష్టపోయేలా చేశారని నిష్టూరమాడారు. తాము ఎన్ని చెప్పినా ప్రజలు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారని, పార్టీ ఇప్పట్లో తేరుకోవడం కష్టమేనని ఇతరనేతలు స్పష్టంచేశారు. ఈ పరిస్థితుల్లో ఓట్లడుగుతూ ప్రజల్లోకి వెళ్లడం కష్టమేనని, అయినా తన శక్తిమేరకు పార్టీకోసం 24 గంటలూ పనిచేస్తానని కేంద్రమంత్రి చిరంజీవి చెప్పారు. తన తమ్ముడు పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని.. పార్టీపై విమర్శలను తిప్పికొట్టే బాధ్యత తనదేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, యువత, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సూచించారు. జనరల్ స్థానాల్లో కూడా ఎస్సీ, ఎస్టీలకు అవకాశమిస్తే దాని ప్రభావం రాష్ట్రమంతా ఉంటుం దన్నారు.
చిరంజీవి, కేవీపీల వాగ్వాదం
కేంద్రమంత్రి చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుల మధ్య సమావేశంలో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశం హాలు బయట ఉన్న కాకినాడ ఎమ్మెల్యే కన్నబాబును చిరంజీవి లోపలకు రావాలని పిలిపించబోయారు. కమిటీలో సభ్యులు కాని వారిని పిలవడం ఎందుకని కేవీపీ అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో చిరంజీవి ఒకింత అసహనంతో.. లోపలకు పిలవనులెండని చెప్పారు. అప్పటికే ఎమ్మెల్యే అక్కడికి రావడంతో దిగ్విజయ్‌సింగ్ జోక్యం చేసుకొని... సభ్యులు కాకపోయినా రావచ్చని, అలా పిలిచే అధికారం తనకు ఉందంటూ కన్నబాబును సమావేశంలో కూర్చోమన్నారు.