
మూడు రోజుల్లో ఏడుగురి ఆత్మహత్యాయత్నం
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): గత మూడు రోజుల్లో హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఏడుగురిని లేక్ పోలీసులు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కవాడిగూడకు చెందిన సాయికుమార్ (24) టీ స్టాల్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి అలవాటు పడిన ఇతను ఈ నెల 2వ తేదీ రాత్రి భార్యతో గొడవకు దిగాడు. దీన్ని గమనించిన అతని తండ్రి మందలించాడు. దీంతో సాయికుమార్ మద్యం మత్తులో ట్యాంక్‌బండ్‌కు వచ్చి హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా లేక్ పోలీసులు రక్షించారు.
బైబిల్‌హౌజ్ ప్రాంతానికి చెందిన రేణుక (23) ఈ నెల 3వ తేదీ రాత్రి తన కుమార్తె సాయిప్రియతో కలిసి ట్యాంక్‌బండ్‌కు వచ్చి సాగర్‌లో దూకేందుకు యత్నిస్తుండగా పోలీసులు రక్షించారు. సుల్తాన్‌షాహికి చెందిన స్వప్న (27), దేవీనగర్‌కాలనీ కవాడీగూడకు చెందిన బి.శృతిలయ(24) 3వ తేదీన తన ఆరు నెలల కుమార్తెతో కలిసి హుస్సేన్ సాగర్‌లో దూకేందుకు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. గస్తీ నిర్వహిస్తున్న లేక్ పోలీసులు వారిని రక్షించారు. అమీర్‌పేట్ ఎల్లారెడ్డిగూడకు చెందిన కవిత(38), రాజు భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని 3వ తేదీన గొడవ పడి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యచేసుకునేందుకు రాగా లేక్ పోలీసులు రక్షించారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.