సిమ్ పోయింది.. డబ్బులూ పోయాయి
► సిమ్‌కార్డుతో బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకొని కుచ్చుటోపీ
► నిందితుడి అరెస్టు
► పేటీఎం నుంచి బ్యాంక్ ఖాతాకు డబ్బులు బదిలీ
సాక్షి, సిటీబ్యూరో: సిమ్‌కార్డు పోయినా సెల్‌నంబర్ బ్లాక్ చేయకపోవడంతో... ఓ ఆర్మీ జవాన్ డబ్బులు పోగొట్టుకున్నాడు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. లాల్‌బజార్‌లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో పనిచేస్తున్న ఆర్మీ జవాన్ హరికేశ్ యాదవ్ గత ఏప్రిల్‌లో తన డెబిట్ కార్డుతో ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేయగా ఆ ఖాతాలో నగదు తక్కువగా ఉన్నట్లు గుర్తించాడు. దీంతో అతను అకౌంట్ స్టేట్‌మెంట్ చూసుకోగా ఈ ఏడాది ఏప్రిల్ 4, 5 తేదీల్లో పేటీఎంతో 32 లావాదేవీలతో రూ.60వేల బదిలీ చేసినట్లు గుర్తించాడు.
తన డెబిట్ కార్డు వివరా లను ఎవరికీ చెప్పని హరికేశ్ యాదవ్ తన బ్యాంక్ ఖాతాకు అనుసంధానంగా ఉన్న సిమ్‌కార్డు పోగొట్టుకున్నట్లు సైబర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే సెల్‌నంబర్‌ను బ్లాక్ చేయలేదని తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో మహేష్ అనే వ్యక్తి ఈ లావాదేవీలు చేసినట్టుగా గుర్తించారు. యాప్రాల్‌లోని రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో పనిచేస్తున్న సమయంలో మహేష్ హరికేశ్ యాదవ్ సిమ్‌కార్డును దొంగలించాడు. వాటి ద్వారా ఏటీఎం కార్డు వివరాలు తెలుసుకొని బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు పేటీఎంకు బదిలీ చేసి అక్కడి నుంచి మరో బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసి వినియోగించాడు.
అయితే మహేశ్ ఇందుకు తన స్నేహితుడైన రాంప్రసాద్ బ్యాంక్ ఖాతాను వాడుకోవడం గమనార్హం. హరికేశ్ ఖాతా నుంచి డబ్బులను నాలుగు పేటీఎం వాలెట్స్‌కు బదిలీ చేసి అక్కడి నుంచి రాంప్రసాద్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశాడు. ఆ తర్వాత సకేత్, ఈసీఐఎల్‌లోని ఏటీఎంల ద్వారా వారు డబ్బులు డ్రా చేసుకుని పంచుకునేవారని పోలీసులు తెలిపారు.