సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ కరెంటు మీటర్లు వచ్చేస్తున్నాయి. స్మార్ట్‌గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా వాటిని బిగించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడ పరిధిలో పరిశ్రమలు, గృహాలకు వీటిని ఏర్పాటు చేయనుంది. రూ.41.82 కోట్ల అంచనా వ్యయంతో జీడిమెట్ల పారిశ్రామికవాడలో చేపట్టేందుకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)తో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్) ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ప్రాజెక్టు వ్యయంలో 50% నిధులను కేంద్రం భరించనుంది. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని 12,880 గృహాలు, పరిశ్రమలకు 2017 సెప్టెంబర్ 17లోగా ఈసీఐఎల్ స్మార్ట్ మీటర్లను బిగించాల్సి ఉంది. స్మార్ట్ మీటర్లు విద్యుత్ వినియోగదారులు, డిస్కంలకు ఉభయ ప్రయోజనకారిగా పనిచేయనున్నాయి. విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించుకోడానికి డిస్కంలకు అవకాశం లభించనుంది.
వినియోగదారులు సెల్‌ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనాఎస్‌ఎంఎస్‌ను తమ ఇంట్లోని స్మార్ట్ మీటర్‌కు పంపించి ఇంట్లో విద్యుత్ వినియోగాన్ని నియంత్రించేందుకు వీలుకలగనుంది. స్మార్ట్‌ఫోన్ తరహాలోనే ఈ స్మార్ట్‌మీటర్ పనిచేయనుంది. ఇందులో ఓ సిమ్‌కార్డుతోపాటు ఎల్‌సీడీ డిస్‌ప్లే బోర్డు ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా పనిచేసే ఈ మీటర్లను ఒక ఎస్‌ఎంఎస్ ద్వారా షట్‌డౌన్ చేసి ఇంట్లో విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయవచ్చు. మెయింటెనెన్స్ పనులు, ఇతరాత్ర అవసరాల కోసం విద్యుత్ కోతలు విధించాల్సి వస్తే సంబంధిత వినియోగదారుల స్మార్ట్ మీటర్లకు డిస్కంలు ఎస్‌ఎంఎస్‌లు పంపించనున్నాయి.
స్మార్ట్ మీటర్‌లో ఉండే డిస్‌ప్లే బోర్డులో ఈ సందేశాలను చూసుకోవచ్చు. ఎస్‌ఎంఎస్ ద్వారానే ఇంట్లోని గ్రీజర్, రిఫ్రిజిరేటర్ వంటి విద్యుత్ పరకరాలను ఆన్/ఆఫ్ చేయవచ్చు. ప్రస్తుతం పరిశ్రమలు పగటి పూట విద్యుత్ వినియోగిస్తే ప్రతి యూనిట్‌పై రూపాయి టైమ్ ఆఫ్ డే(టీఓడీ) పెనాల్టీని విధిస్తున్నారు. రాత్రివిద్యుత్ వాడకంపై పరిశ్రమలకు విద్యుత్ చార్జీలో ప్రతియూనిట్‌పై రూపాయి రాయితీని ఇస్తున్నారు. రాయితీలు లభించే రాత్రిపూట మాత్రమే విద్యుత్‌ను వినియోగించేవిధంగా పరిశ్రమలు స్మార్ట్ మీటర్‌ను సెట్ చేసుకొని పెట్టుకోవచ్చని టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయ్!
Published Fri, Oct 21 2016 3:18 AM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM
Advertisement
Advertisement