భార్య కేసు పెట్టిందని..సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం ఈ సమాజంలో తరచూ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కళ్లు చెదిరే వేతనాలు, విలాసవంతమైన జీవితం ఉంటుందనే కోటి ఆశలతో సాఫ్ట్‌వేర్ రంగంలో అడుగుపెడుతున్న యువత ఆ రంగంలో ఉండే ఒత్తిడి, కుంగుబాటును తట్టుకొని నిలబడలేకపోతుందనే వాదన వినిపిస్తోంది. ఇక నిన్నటికి నిన్న యాప్ రూపొందించాలన్న తన కల సక్సెస్ కాకపోవడంతో హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడగా.. తాజాగా మరో టెక్కీ చిన్న కారణానికే ప్రాణాలు తీసుకున్నాడు.
భార్య వేధింపుల కేసు పెట్టిందని మనస్థాపానికి లోనైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ పట్టణానికి చెందిన విజయ్‌కుమార్ (30) ఉప్పల్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఏడాదిక్రితం అదే పట్టణానికి చెందిన దివ్యతో వివాహం జరిగింది. కాగా వారు నాలుగు రోజులు మాత్రమే కలిసి ఉన్నారు. ఇద్దరి మద్య మనస్పర్థలు రావటంతో దివ్య పుట్టింట్లో ఉంటోంది. విజయకుమార్ కర్మన్‌ఘాట్ క్రాంతినగర్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. ఇటీవల దివ్య అతనిపై వరంగల్ స్టేషన్‌లో 498ఏ కేసు పెట్టినట్లు నాలుగు రోజుల క్రితం అతని తండ్రి విద్యాసాగర్ ఫోన్ చేశాడు.
గురువారం ఉదయం తండ్రి ఫోన్ చేయగా విజయ్‌కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఇబ్రహీంపట్నంలో ఇంజీనీరింగ్ చదువుతున్న తమ్ముడి కుమారుడు మహేష్‌కు సమాచారం అందింయాడు. అతను విజయ్‌కుమార్ ఇంటికి వెళ్లి పిలిచినా తలుపులు తీయకపోవటంతో తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా విజయ్‌కుమార్ లుంగీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేశారు. భార్య కేసు పెట్టిందన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.