పుట్టిన రోజునాడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
మల్యాల: హైదరాబాద్‌లో ఓ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన పుట్టిన రోజునాడే ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు బతకాలని లేదంటూ తమ్ముడికి ఎస్‌ఎంఎస్ పంపించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామంలో జరిగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూర్ మండలం బట్టపాడు గ్రామానికి చెందిన నిరంజన్‌కుమార్ ఆరేళ్లుగా హైదరాబాద్ నిజాంపేటలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. ఏడాది క్రితం మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన వైద్యురాలు ప్రవళికతో వివాహం జరిగింది.
కుటుంబ కలహాలతో మూడు నెలల క్రితం ప్రవళిక హైదరాబాద్‌లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక తల్లిదండ్రులు నిరంజన్‌పై వరకట్నం కేసు పెట్టారు. ఈ కేసులో నిరంజన్‌కుమార్ రెండు నెలలపాటు జైలులో ఉండి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. శుక్రవారం వరకట్నం కేసు విచారణకు హాజరై రాజారం వచ్చాడు. అర్ధరాత్రి తనకు బతకాలని లేదని, చనిపోతున్నానంటూ నెల్లూరులోని తమ్ముడు రంజిత్‌కు ఎస్‌ఎంఎస్ పంపించాడు. అనంతరం రాజారంలోని అత్తగారింటి వద్ద ఉరివేసుకున్నాడు. తమ చిన్నప్పుడే తల్లిదండ్రులు వెంగయ్య, శోభ సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్‌లో పనిచేసి, మృతిచెందారని... వారి పెన్షన్ ద్వారా నిరంజన్ చదువుకున్నాడని చెప్పాడు. ఇంజనీరింగ్‌లో 98 శాతం సాధించి, ఆరేళ్లపాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడని, హైదరాబాద్ నుంచి ఇక్కడి వచ్చి ఎందుకు ఉరివేసుకున్నాడో అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.