
దక్షిణ డిస్కంకు ఎ-గ్రేడ్
- బీ+ రేటింగ్‌తోనే సరిపెట్టుకున్న ఉత్తర డిస్కం
- జాతీయ స్థాయి వార్షిక రేటింగ్‌లను ప్రకటించిన కేంద్రం
- ఇకపై సకాలంలో ఏఆర్‌ఆర్‌లు సమర్పించాలని సూచన
సాక్షి, హైదరాబాద్: కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన 4వ జాతీయ స్థాయి వార్షిక రేటింగ్స్‌లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) ఎ-గ్రేడ్ సాధించి మంచి పనితీరును చాటుకోగా...ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎన్పీడీసీఎల్) మాత్రం బీ+ గ్రేడ్‌తో సరిపెట్టుకుంది. పనితీరు ఆధారంగా 2012 నుంచి కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ వివిధ రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఏటా రేటింగ్స్ కేటాయిస్తోంది. కార్యశీలత, ఆర్థిక నియంత్రణ, సంస్కరణలపరంగా డిస్కంల పనితీరును పరిగణనలోకి తీసుకొని 21 రాష్ట్రాల్లోని 40 ప్రభుత్వరంగ డిస్కంలకు తాజాగా 2016కి సంబంధించిన వార్షిక రేటింగ్స్‌ను ప్రకటించింది. విద్యుత్‌రంగ ప్రాజెక్టులకు రుణాలను కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) పర్యవేక్షణలో కేర్, ఇక్రా అనే ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఈ రేటింగ్స్‌ను కేటాయించాయి. ఇందులో డిస్కంల బలాలు, బలహీనతలను ప్రముఖంగా వెల్లడించిన కేంద్రం... పనితీరు మెరుగుదల కోసం డిస్కంలు తీసుకోవాల్సిన చర్యలను సైతం సిఫారసు చేసింది.
దక్షిణ డిస్కంకు సిఫారసులు: 2017-18కి సంబంధించిన ఏఆర్‌ఆర్‌ను సకాలంలో వచ్చే నవంబర్ 30లోగా ఈఆర్సీకి సమర్పించాలి. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోళ్లను పెంచి విద్యుత్ కొనుగోలు ధరలను హేతుబద్ధీకరించాలి.
ఉత్తర డిస్కంకు సిఫారసులు: ఏఆర్‌ఆర్‌లను సకాలంలో దాఖలు చేయాలి. మీటరింగ్‌ను మెరుగుపరుచుకోవాలి.దీర్ఘకాలిక ఒప్పందాలతో విద్యుత్ కొనుగోళ్లు చేపట్టాలి.