మెగా ప్రాజెక్టులకు ప్రత్యేక రాయితీలు
కేటీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ
♦ విస్తరణకు సిద్ధంగా ఉన్న పాత పరిశ్రమలకూ వర్తింపు
♦ మూతపడిన పరిశ్రమలకు ఊతమిచ్చే యోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ. 200 కోట్లకు పైగా పెట్టుబడితో.. కనీసం వేయి మందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో భారీ పెట్టుబడులతో వచ్చే పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలపై చర్చించేందుకు బుధవారం సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం సమావేశం జరిగింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెగా పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.
రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న కొన్ని పరిశ్రమలు మరింత పెట్టుబడితో విస్తరిస్తే మెగా ప్రాజెక్టుల కేటగిరీలోకి వస్తాయని.. అలాంటి పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలపైనా చర్చించారు. రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధి ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలను రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. టీఎస్ ఐపాస్ ద్వారా సమకూరే ఆదాయంలో కొంత మొత్తాన్ని ప్రత్యేక నిధి ఏర్పాటుకు వినియోగించేలా.. సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆమోదం పొందాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది.
389 మెగా ప్రాజెక్టులకు అనుమతులు
టీఎస్ ఐపాస్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 389 మెగా ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసినట్లు మం త్రి కేటీఆర్ వివరించారు. పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేం దుకు ఆర్థిక శాఖ సానుకూలంగా ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడిం చారు. అయితే రాయితీలను పరిశ్రమ ఆరంభంలో కాకుండా.. పనులు, ఉత్పత్తి పురోగతిని బట్టి ఇవ్వాలని సూచిం చారు. కాగా.. రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల పునః ప్రారంభానికి మద్దతు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని.. ఇప్పటికే మూతపడిన ఫెర్రో అల్లాయ్ పరిశ్రమలను తిరిగి తెరిపించడంపై సమావేశంలో చర్చించారు.
ఫెర్రో అల్లాయ్ పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌పై యూనిట్‌కు రూపాయిన్నర చొప్పున రాయితీ ఇవ్వాలని.. ఏడాది పాటు రాయితీ కొనసాగించి, ప్రతీ మూడు నెలలకోమారు రాయితీ చెల్లించాలని నిర్ణయించారు. విద్యుత్ బకాయిలను వాయిదాల్లో చెల్లించేం దుకు డిస్కమ్‌లు అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. మూతపడిన భీమా సిమెంటు పరిశ్రమను తిరిగి తెరిపించేందుకు ప్రభుత్వం సహ కరిస్తుందని.. అయితే పరిశ్రమను పూర్తిస్థాయిలో నడిపిస్తేనే సాయం అందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.