‘అదర్స్’ సంగతి తేల్చాల్సిందే! | Special investigation on the cases Nazar | Sakshi
Sakshi News home page

‘అదర్స్’ సంగతి తేల్చాల్సిందే!

Published Fri, Apr 15 2016 12:25 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

‘అదర్స్’ సంగతి తేల్చాల్సిందే! - Sakshi

‘అదర్స్’ సంగతి తేల్చాల్సిందే!

దర్యాప్తులో ఉన్న కేసులపై ప్రత్యేకంగా నజర్
పరారీలో ఉన్న నిందితులందరినీ పట్టుకోవాల్సిందే
యూఐ మేళాల్లో స్పష్టం చేస్తున్న నగర కమిషనర్

 

2011లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రమేష్ బీహార్‌లో సురేష్ అనే వ్యక్తి నుంచి నాటు తుపాకీ ఖరీదు చేశాడు. దానిని ఎక్కువ ధరకు విక్రయించేందుకు నగరానికి వచ్చాడు. 2013లో బెంగళూరుకు చెందిన మనీష్ అదే ప్రాంతానికి చెందిన ప్రకాష్ ద్వారా ముంబైలో ఉండే నైజీరియన్ నుంచి సేకరించిన డ్రగ్ విక్రయించేందుకు ఇక్కడకు చేరుకున్నాడు.

 

సిటీబ్యూరో: సిటీకి వచ్చిన రమేష్, మనీష్‌ల కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఆ సందర్భంలో నమోదు చేసిన కేసుల్లో సురేష్, మనీష్ తదితరుల్ని పరారీలో ఉన్న నిందితులుగా చూపారు. ఒకప్పుడు నెలకొన్న పరిస్థితులతో కేసుల దర్యాప్తు, విచారణ పూర్తయినా... పరారీలోని వాళ్లు వాంటెడ్‌గానే మిగిలేవారు. అయితే ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న (యూఐ) కేసులపై మేళాలు నిర్వహిస్తున్న కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పరారీగా చూపిన ప్రతి నిందితుడినీ అరెస్టు చేయాలని స్పష్టం చేస్తున్నారు. ఆ బాధ్యతల్ని ఆయా ఠాణాలకు చెందిన క్రైమ్ సిబ్బందికి అప్పగిస్తున్నారు.

 
‘స్పెషల్’ కేసుల్లో ఇది పరిస్థితి...

ఇతర రాష్ట్రాల నుంచి మారణాయుధాలు, మాదకద్రవ్యాలను అక్రమ రవాణా ద్వారా నగరానికి తీసుకొస్తున్న నేరగాళ్లపై టాస్క్‌ఫోర్స్‌తో పాటు జోన్లకు చెందిన స్పెషల్ టీమ్స్ నిఘా పెట్టి పట్టుకునేవి. ఆ సందర్భాల్లో వాటిని తీసుకువచ్చిన వాళ్లు మాత్రమే చిక్కేవారు. వీరికి ఆయుధాలు, డ్రగ్స్ అందించిన, సహకరించిన కీలక నిందితులు మాత్రం ఆయా రాష్ట్రాల్లోనే ఉండిపోవడంతో చిక్కట్లేదు.  దుండుగుల్ని అరెస్టు చేస్తున్న టాస్క్‌ఫోర్స్, స్పెషల్ టీమ్స్ వారు చిక్కిన పరిధిలోని ఠాణాలకు అప్పగించి కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ కేసుల్లోనే పరారీలో ఉన్న నిందితుల జాబితాలో అరెస్టయిన వారు చెప్పిన పేర్లతో పాటు మరికొందరు (అండ్ అదర్స్) అని పొందుపరుస్తున్నారు.

 
లోకల్ కేసుల్లోనూ ‘అదర్స్’...

కేవలం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన నేరగాళ్లకు సంబంధించిన కేసుల్లో మాత్రమే కాదు... స్థానిక ఉదంతాలపై నమోదైన వాటిలోనూ ‘అండ్ అదర్స్’ ఉంటున్నారు. సిటీలో జరిగిన ఓ భారీ చోరీ, హత్య, హత్యాయత్నం కేసుల్లో స్థానికులే నిందితులుగా ఉన్నప్పటికీ వారికి ఆయుధాలు అందించడం వంటి ‘సహాయాలు’ చేస్తున్న వారిలో ఇతర రాష్ట్రాల వారితో పాటు గుర్తుతెలియని వ్యక్తులూ ఉంటున్నారు. దీంతో ఆయా కేసుల్లోనూ అరెస్టయిన వారితో పాటు నిందితుల జాబితాలో గుర్తించిన, గుర్తించని ‘ఇతరులు’ వాంటెడ్‌గా ఉండిపోతున్నారు. ప్రధాన, కీలక నిందితులు చిక్కిన తర్వాత ఇతర నిందితులపై పోలీసులు దృష్టి పెట్టడంలేదు.

 
ఇప్పుడు అదిరిపోతున్న సిబ్బంది...

ఈ కారణాల నేపథ్యంలో కొన్ని కేసులో కొలిక్కి వచ్చి, విచారణ పూర్తయ్యే దశకు చేరినా పరారీలో ఉన్న వారు వాంటెడ్‌గానే మిగిలిపోతున్నారు. మరికొన్ని సందర్భాల్లో దర్యాప్తులో ఉన్న కేసులు పూర్తి స్థాయిలో కొలిక్కి చేరక పెండెన్సీ పెరిగిపోతోంది. కేసుల భారం తగ్గించేందుకు నగర పోలీసు విభాగం గడిచిన రెండేళ్లుగా క్రమం తప్పకుండా దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి అండర్ ఇన్వెస్టిగేషన్ (యూఐ) కేసు మేళాలు నిర్వహిస్తోంది. వీటికి హాజరవుతున్న, నిత్య సమావేశాలు నిర్వహిస్తున్న కమిషనర్ మహేందర్‌రెడ్డి ‘అదర్స్’ను పట్టుకుని తీరాల్సిందే అని సిబ్బందికి స్పష్టం చేస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలకు వెళ్లి, గుర్తుతెలియని పరారీలో ఉన్న నిందితుల్ని పట్టుకోవడం ఎలా? అని సిబ్బంది, అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

 

నేరాల నిరోధంలో భాగమే:
‘ఏరకంగా అయితే అమాయకుడిని శిక్ష పడకూడదో... అదే రకంగా నేరం చేసిన వ్యక్తి సైతం తప్పించుకోకూడదు. కొన్ని కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న వ్యక్తులు ఇక్కడో, మరోచోటో నిత్యం నేరాలు చేస్తూనే ఉంటారు. అది వారి ప్రవృత్తికి నిదర్శనం. అలాంటి వారిలో మనకు వాంటెడ్‌గా ఉన్న వారిని గుర్తించి, వెతికి పట్టుకోగలిగితే ఆ మేరకు నేరాలు నిరోధించినట్లే. తప్పు చేసిన వ్యక్తిని న్యాయస్థానం ముందు నిలపాల్సిన బాధ్యత పోలీసులదే. కేసుల పెండింగులన్నీ తగ్గాలన్నా ఈ వాంటెడ్స్ భారం తగ్గించుకోవాల్సిందే’ - నేర విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement