సారే జగాసే అచ్ఛా | special story to Allama Iqbal Mahmood | Sakshi
Sakshi News home page

సారే జగాసే అచ్ఛా

Published Mon, Dec 8 2014 11:25 PM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

సారే జగాసే అచ్ఛా - Sakshi

సారే జగాసే అచ్ఛా

అల్లామా మహమూద్ ఇక్బాల్ (1877 నవంబర్ 9- 1938 ఏప్రిల్ 21). ఇక్బాల్‌గా మధ్యధరా దేశాలకు, ఉపఖండం ప్రజలకు పరిచితుడు. ప్రపంచ ప్రజలకు తూర్పుదేశాల కవి. భారతీయులకు ఇక్బాల్ అంటే ‘సారే జహా సే అచ్ఛా’! పాకిస్తానీయులకు జాతీయ కవి! గాయత్రి మంత్రం తన ప్రార్థనగా, ‘రాముడు హిందుస్తాన్ ఇమామ్’గా అభివర్ణించిన ఇక్బాల్ వంటి జాతీయవాదులు తర్వాతి కాలంలో ‘విభజన ఆలోచన’ ఎందుకు చేయవలసి వచ్చిందో, నేపథ్యమేమిటో అధ్యయనం చేస్తోన్న అభిమానులు ఉభయ దేశాల్లోనూ
 ఉన్నారు!
 
అదలా ఉంచితే.. ఇక్బాల్‌కు ైెహదరాబాద్ ఒయాసిస్! ఇంగ్లండ్‌లో ఉన్నత విద్య అనంతరం లాహోర్‌లో కొన్నాళ్లు ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. వృత్తి జీవితానికి రోసిల్లాడు. జర్మన్ మహాకవి గోథేలా నచ్చింది చదువుతూ - రాస్తూ సాహితీ ప్రపంచంలో విహరించాలని ఇక్బాల్ భావించారు. ఎలా సాధ్యం? ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ అనే ఉద్యానవనంలో ఆయన ప్రధానమంత్రి మహారాజా కిషన్ ప్రసాద్ అనే పచ్చని చెట్టు కొమ్మలనే చేతులతో ఆహ్వానించింది. 1910 డిసెంబర్ 21వ తేదీన తొలిసారి హైదరాబాద్ వచ్చారు.
 కిషన్ ప్రసాద్ నివాసంలో ముషాయిరాలో పాల్గొన్నారు.  పౌర్ణమి రాత్రి కుతుబ్‌షాహీ సమాధులను సందర్శించారు. ఆ వాతావరణం ఆయనతో ‘గొరస్తాన్ -ఎ-షాహీ (రాజుల సమాధులు)’ అనే ‘నజమ్’ను పలికించింది. ‘ఆస్మాన్ బాదల్ కా పెహెనే కిర్కా-ఎ-దరీనా హై’ అంటూ రాజ్యాల ఉత్థాన పతనాల కవనాన్ని కళాపోషకుల వహ్వా వహ్వాల మధ్య వినిపించారు ఇక్బాల్. ఈ షాయరీని https://rekhta.org/nazms/ goristaaneshaahiialla maiqbalnazms లింక్‌లో వినవచ్చు. అందులోని కొన్ని చరణాలు, తెలుగులో..
 
ఆకాశం ధరించిన  మేఘాల ‘పురా-నవ’ దుస్తులు చంద్రుని నొసటి అద్దంపై దోగాడుతున్నాయి  నీరవ నిశ్శబ్దంలో చంద్రకాంతి లీలగా ఉంది రాత్రి ఒడిలో ఉదయం నిద్రిస్తోంది  ఆకు కదలని నిశ్శబ్దం ఎంత చిత్రం  ఈ నిశ్శబ్దం ప్రకృతి వీణియపై మౌనరాగం విశ్వహృదయపు ప్రతి అణువులో ముప్పిరిగొన్న వేదన వర్తమానపు పెదవులపై విచారపు వ్యక్తీకరణలా నిశ్శబ్దం ఓహ్! ఆ కోట, కదనకాహకాల మైదానం
 భుజాలపై వేల వత్సరాల భారాన్ని మోస్తోంది ఒకానొక కాలంలో జీవంతో రాజిల్లిన నేటి  నిస్తేజపు ఒంటరి  ఈ నిశ్శబ్దం పాత వైభవానికి సమాధిగా తోస్తోంది  తన ప్రేమికుల్లో నిలచిన ఒకే ఒక అవశేషం ఈ కోట  కొండపై జ్ఞాపకాలను పహారా కాస్తున్న ఏకాకిలా ఉంది  ఆకాశపు కప్పు నుంచి మబ్బు కిటికీలోంచి ఒక చిన్నారి ఆకుపచ్చని నక్షత్రం భువిని చూస్తోంది. ఈ లోకం పోకడ ఆ తారకు పసిబాలల ఆటలా తోస్తోంది  మానవ వైఫల్యపు గాథ తనకు కంఠతా వచ్చులా ఉంది
 
 ఈ ప్రయాణికుడి నిరంతర గమ్యయానాన్నీ  విప్లవాల తమాషాను ఆకాశం నుంచి చూస్తోంది  నింగిలోని తారలు నేలపై మౌనాన్ని పాటించడం వీలుకానప్పటి కీ చనిపోయిన వారి కోసం ఆ నక్షత్రం ఒక్క క్షణం మౌనం పాటించింది  నేల ఎన్నెన్నో  జీవన క థాపుష్పాల సమాహారం  అంతరించిన ఎన్నెన్నో నాగరికతలు ఈ పొరల్లో ఉన్నాయి  ఈ వేదనల శరభూమి రాజుల విశ్రాంతి స్థలి
 ఓ కాఠిన్య నేత్రమా వెచ్చని కన్నీటితో నివాళించుమా! ఇది సమాధి స్థలమే కాని ఇక్కడి ధూళి ఆకాశోన్నతం ఈ ధూళి రాశి ఒక దుర దృష్ట జాతి సంపద  ఈ మరుస్థలిలోని మహోన్నత భవనాల రాజసం  ‘అన్నీ చూసేవాడు’  కడగంటి చూపుతో మెచ్చుకునేలా ఉంది
 పదాలు ఆ అనిర్వచనీయతను పట్టుకోలేకపోతున్నాయి వర్ణన అనే అద్దంలో చూపేందుకు వీలుకాని సౌందర్యం ఇది
 నెరవేరని కోర్కెలతో అసహనపు నిట్టూర్పులతో నిద్రించే జన సమూహాలకు దూరంగా నిశ్శబ్దం నిదురిస్తోంది చిక్కని సమాధుల నలుపు ఉషోదయానికి వేదిక  ఆ గుమ్మంలోంచే కదా వెలుతురు ప్రసరించేది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement