రాజధాని టు రాజధాని
- విజయవాడ, గుంటూరుకు తరలివెళ్తున్న ఏపీ ఉద్యోగులు
- రైల్వే, ఆర్టీసీ అదనపు ఏర్పాట్లు
- 20 రైళ్లు, 300లకుపైగా బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ కొత్త రాజధాని ప్రాంతానికి ఉద్యోగులు తరలి వెళుతున్నారు. దీంతో ఆర్టీసీ, దక్షిణమధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల నుంచి సుమారు 26 వేల మంది ఉద్యోగులు తరలి వెళ్లనున్నట్లు అంచనా. అలాగే సుమారు 6వేల మంది ఉద్యోగులు వారాంతాల్లో విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించనున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లపై దృష్టి సారించాయి.
ప్రతి అరగంటకు ఒక బస్సు
నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌లతో పాటు, వివిధ ప్రధాన ప్రాంతాల నుంచి విజయవాడ వరకు, గుంటూరు, విజయవాడల మీదుగా ఇతర ప్రాంతాలకు ఏపీఎస్ ఆర్టీసీ 250, టీఎస్‌ఆర్టీసీ 50 బస్సులు నడుపుతున్నాయి. ప్రస్తుతం ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున విజయవాడ వైపు వెళుతోందని, రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. మరోవైపు ‘అమరావతి’ స్పెషల్, సూపర్‌లగ్జరీ బస్సులను పెంచేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజూ 400కు పైగా ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. రద్దీ పెరగడంతో అదనపు ట్రిప్పులు నడిపేందుకు సైతం ట్రావెల్స్ సిద్ధంగా ఉన్నాయి.
ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ....
రాజధాని తరలింపు దృష్ట్యా ఇటీవల రైల్వే మంత్రి సురేష్‌ప్రభు విజయవాడ-హైదరాబాద్ మధ్య ఏపీ ఉద్యోగుల కోసం ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించారు. వారానికి 6 రోజులు రాకపోకలు సాగించే ఈ ట్రైన్ గుంటూరు, విజయవాడల్లో మాత్రమే ఆగుతుంది. రద్దీ పెరిగితే అదనపు బోగీలు ఏర్పాటు చేసే అవకాశముంది. ఏపీలో వారానికి 5 రోజులు మాత్రమే పనిదినాలు కావడంతో శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆదివారం సాయంత్రం కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికుల రద్దీ బాగా ఉంటుంది. ప్రస్తుతం రోజూ హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి విజయవాడ మీదుగా వెళ్లే 20 రైళ్లలో తీవ్ర రద్దీ నెలకొంది.