వరిసాగు పావుశాతమే!
సాక్షి, హైదరాబాద్: సాగు నీటి వనరులు సక్రమంగా లేకపోవడంతో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం దాదాపు పావు శాతానికే పరిమితమైంది. ఖరీఫ్‌లో 26.47 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగాల్సి ఉండగా 6.67 లక్షల ఎకరాల్లోనే వరినాట్లు పడినట్లు వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ ఖరీఫ్‌లో మొత్తం 1.03 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 76.07 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగింది. పత్తి నూరు శాతం విస్తీర్ణంలో సాగు జరిగింది.
అయితే వర్షాలు సకాలంలో కురవకపోవడంతో అనేక చోట్ల వేసిన పత్తి ఎండిపోయింది. ప్రస్తుత వర్షాలకు కాస్త కోలుకున్నట్లేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సోయాబీన్ లక్ష్యానికి మించి 6.27 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే 90 శాతం ఎండిపోయిందని చెబుతున్నారు.
వర్షాలు కురుస్తున్నా.. 19 శాతం లోటు
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నప్పటికీ రాష్ర్టంలో 19 శాతం వర్షపాత లోటు కనిపిస్తోంది. బుధవారం నాటికి 44.8 సెం.మీ. వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 36.2 సెం.మీ. మాత్రమే కురిసింది. దీంతో నిజామాబాద్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. గతేడాది జూన్‌లో 12.56 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు లభిస్తే అదే ఏడాది జూలైలో 12.73 మీటర్ల లోతుకి నీరు అడుగంటాయి. గత ఏడాది జూలైతో పోలిస్తే ఏకంగా 2.17 మీటర్ల లోతుకి కూరుకుపోయాయి.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు...
బంగాళాఖాతంలో అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కరీంనగర్, మంథనిలో 11 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రుద్రూరు, కాళేశ్వరంలో 10 సెంటీమీటర్ల చొప్పున పడింది. కోటగిరిలో 9 సెం.మీ., వర్ని, బెజ్జంకిలో 8 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.