గ్రేటర్‌లో గాలివాన బీభత్సం
పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడి వాహనాలు ధ్వంసం
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ద్రోణి, ఆగ్నేయ, దక్షిణ దిశల నుంచి ఉధృతంగా వీస్తున్న తేమ గాలులు, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నగరంలో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్ సహా పలు శివారు ప్రాంతాల్లో భారీగా గాలి దుమారం చెలరేగడంతో కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి వాటి కింద పార్కింగ్ చేసిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలుల బీభత్సానికి విద్యుత్ తీగలు తెగిపడటంతో రాజేంద్రనగర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లోని 15 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
గురువారం గరిష్టంగా 39.8 డిగ్రీలు, కనిష్టంగా 24.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ 35 శాతంగా నమోదైనట్లు పేర్కొంది. రాగల 24 గంటల్లో అక్కడక్కడా వడగళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయంది. కాగా, ఈదురు గాలులు.. భారీ వర్షంతో హిమాయత్‌సాగర్ గ్రామ ప్రజలు గురువారం మధ్యాహ్నం భయాందోళనకు గురయ్యారు. ఒక పోలీసు వాహనంతో పాటు 3 ద్విచక్ర వాహనాలు, 20 షాపులు, విద్యుత్ వైర్లు ధ్వంసం కాగా వందకు పైగా చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లపై నాలుగు ప్రాంతాల్లో భారీ చెట్లు విరిగి పడటంతో వైర్లు తెగి అంధకారం నెలకొంది. హిమాయత్‌సాగర్ ప్రధాన రహదారి, గెస్ట్‌హౌస్, జలమండలి కార్యాలయం ఆవరణలో ఉన్న భారీ చెట్లు వేర్లతో సహా విరిగిపడ్డాయి. ఆస్తినష్టం అధికంగా జరిగినట్లు తెలుస్తోంది.
వడగండ్ల వాన బీభత్సం
సాక్షి, నల్లగొండ/రంగారెడ్డి జిల్లా: వడగండ్ల వాన రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో బీభత్సం సృష్టించిం ది. నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి, కనుముకుల, జిబ్లక్‌పల్లి, దంతూర్, మర్రిగూడ, రాజాపేటల్లో వరి, బత్తాయి, మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. అలాగే, రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో 4 గంటల పాటు విద్యుత్ నిలిచిపోయింది. పూడూరు మండలం కడ్మూరులో పిడుగుపాటుకు రెండు ఎడ్లు, రెండు లేగదూడలు మృత్యువాత పడ్డాయి. వికారాబాద్‌లో ఓ చెట్టుపై పిడుగుపడింది. పిడుగుపాటుకు మహబూబ్‌నగర్ జిల్లాలో ముగ్గురు, నల్లగొండలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.