రోడ్డున పడిన డీఎడ్ విద్యార్థులు
- అనుమతి లేకుండా ఉర్దూ మీడియంలో చేర్చుకున్న ఆరు కాలేజీలు
- హాల్‌టికెట్లను నిరాకరించిన విద్యాశాఖ
- ఆందోళనలో వేలాది మంది విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: మైనారిటీ డీఎడ్ కాలేజీ యాజమాన్యాల అత్యాశ వందలాది మంది విద్యార్థులను రోడ్డున పడేసింది. తెలుగు మీడియం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) కోర్సు నిర్వహణకు మాత్రమే అనుమతి ఉన్న కాలేజీల్లో ఉర్దూ మీడియం డీఎడ్‌లో విద్యార్థులను చేర్చుకోవడం వారి పాలిట శాపంగా మారింది. కాలేజీలో ఉర్దూ మీడియంకు అనుమతి ఉందో? లేదా? తెలియని విద్యార్థులు కాలేజీల్లో చేరి చివరకు విద్యా సంవత్సరాన్ని నష్టపోయారు. 6 కాలేజీల యాజమాన్యాలు అనుమతి లేని కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకోవడంతో ఈ నెల 17 నుంచి ప్రారంభమైన వార్షిక పరీక్షలకు వారిని విద్యా శాఖ అనుమతించలేదు.
ఏటా ఇదే తంతు..
విద్యార్థుల నుంచి వేల రూపాయలు దండుకుంటున్న యాజమా న్యాలు ఏటా నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా ప్రవే శాలు చేపడుతున్నాయి. పరీక్షల సమయం రాగానే మైనారిటీ కాలేజీల్లో పిల్లలకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వరా? అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, అనుమతులు పొందడం పరిపా టిగా మారింది. 2016–17 విద్యా సంవత్సరంలోనూ ఇదే ఆలోచ నతో ప్రవేశాలు చేపట్టాయి. డైట్‌సెట్–ఏసీ కన్వీనర్, యాజమా న్యాలు కుమ్మక్కై ఈ అక్రమానికి తెరలేపినట్లు ఆరోపణలు వ్యక్త మవుతున్నాయి. అయితే ఈసారి 6 తెలుగు మీడియం మైనారిటీ కాలేజీల్లో అనుమతి లేని ఉర్దూ మీడియంలో విద్యార్థులను చేర్చు కుని అనుమతి కోసం విద్యాశాఖ చుట్టూ తిరిగారు. కానీ డైట్‌సెట్ చైర్మన్‌గా ఉన్న పాఠశాల విద్య డైరెక్టర్ అనుమతి ఇవ్వలేదు.
తెలుగు మీడియంలో ఉర్దూ మీడియం విద్యార్థులను చేర్చుకో వడం నిబంధనలకు విరుద్ధమంటూ ఆరు కాలేజీల విద్యార్థుల జాబితాను ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపించలేదు. పరీక్షల విభాగం వారికి హాల్‌టికెట్లు జారీ చేయలేదు. ఆందోళనలోపడ్డ యాజమాన్యాలు ప్రభుత్వం, విద్యాశాఖపై ఒత్తిడి తెచ్చాయి. అయితే విద్యాశాఖ దీనికి అంగీకరించలేదు. కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఆయా కాలేజీల్లో ఉర్దూ మీడియంలో చేరిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.