
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు
నేరుగా అందించిన కాంగ్రెస్ విప్ సంపత్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులను కాంగ్రెస్ విప్ సంపత్ కుమార్ ఆయా నేతలకు అందజేశారు. ఈ కేసులో పిటిషనర్ అయిన సంపత్ కుమార్... మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, రెడ్యానాయక్, జి.విఠల్‌రెడ్డి, కోరం కనకయ్యలతోపాటు స్పీకర్ మధుసూదనాచారికి సుప్రీం నోటీసులను (పిటిషనర్ నేరుగా నోటీసులను అందించడాన్ని దస్తీ నోటీసులు అంటారు) అందించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నోటీసు అందుకున్న 3 వారాల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. కొత్త రాష్ట్రంలో ఆదర్శ పాలన ఉంటుందనే ఆశలపై టీఆర్‌ఎస్ నీళ్లు చల్లిందని విమర్శించారు. తెలంగాణను రాజకీయ వ్యభిచారానికి నిలయంగా టీఆర్‌ఎస్ మార్చిందని సంపత్ కుమార్ దుయ్యబట్టారు. ఫిరాయింపుల వ్యవహారంపై స్పీకర్‌ను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని... అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన నోటీసులను నేరుగా అందించామన్నారు. ప్రభుత్వం డబ్బు సంచులను ఎరచూపి రాజకీయ ఫిరాయింపులను ఇంకా ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.