వాస్తవాలను తేల్చాలి: సురవరం
ఏఓబీ ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలి
- పట్టుకుని కాల్చి చంపడం దారుణం
- ఎన్‌కౌంటర్‌పై ఎన్నో సందేహాలు వస్తున్నాయి
- దీనిపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఏఓబీ ఎన్‌కౌంటర్ ఘటనపై న్యాయ విచారణ జరిపించి, నిజాలను నిగ్గుతేల్చాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. 34 మంది మావోయిస్టులు మరణించడాన్ని బట్టి అది ఎన్‌కౌంటర్ కాదని స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. మావోయిస్టులను ముందుగానే పట్టుకుని, రోజుకు కొందరిని హతమార్చుతూ ఎన్‌కౌంటర్లుగా ప్రకటిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, గుండా మల్లేశ్, ఈర్ల నర్సింహలతో కలసి సురవరం విలేకరులతో మాట్లాడారు.
ఎన్‌కౌంటర్ ఘటన ఏపీ పరిధిలో జరిగినా మృతదేహాలను ఒడిశాకు తీసుకెళ్లడం అనుమానాలకు తావిస్తోందని.. పౌర హక్కుల సంఘాలూ ఇదే విషయాన్ని చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టకుండా కాల్చి చంపడం దారుణమన్నారు. వారికి విషం, మత్తు మందు పెట్టారనే ఆరోపణలూ వస్తున్నాయని చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏపీ పోలీసులు పాల్గొన్నందున ఏపీ ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.
లేఖపై విచారణ జరపాలి
మావోయిస్టుల విధానాలు, అనుసరించే పద్ధతులను తమ పార్టీ అంగీకరించదని... అయితే ఏకపక్షంగా చంపే హక్కు పోలీసులకు లేదని సురవరం పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిదని చెప్పారు. ఇక చంద్రబాబు కుటుంబంపై భౌతిక దాడులకు పాల్పడతామంటూ మావోయిస్టుల పేరిట వచ్చిన లేఖ నకిలీదని పోలీసులు, పౌర హక్కుల నేతలు కూడా చెబుతున్నారని... అది నకిలీదే అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలన్నారు. ఆ లేఖ నిజమైనదైతే చంద్రబాటు కుటుంబాన్ని టార్గెట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు జెడ్ ప్లస్ రక్షణ కోసమే ఈ లేఖను సృష్టించారనే ఆరోపణలూ వస్తున్నాయని చెప్పారు. ఈ అంశాలపైనా విచారణ జరిపించాలన్నారు.
ఘర్షణల సృష్టికి ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నాలు
దేశంలోని అనేక చోట్ల ఘర్షణలను సృష్టించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తోందని సురవరం ఆరోపించారు. దీని పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సంఘ్ కేంద్ర కమిటీ సమావేశాల్లో కేరళ, పశ్చిమబెంగాల్‌లలో హిందువులపై దాడులు జరుగుతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వామపక్షాలు హిందువులకు వ్యతిరేకమనే ఆర్‌ఎస్‌ఎస్ అవాస్తవమని స్పష్టం చేశారు. వామపక్షాలు ఏ మతానికి వ్యతిరేకం కాదని, అనుకూలమూ కాదని చెప్పారు. అన్ని మతాల పట్ల సమానమైన గౌరవాన్ని కలిగి ఉన్నాయని సురవరం పేర్కొన్నారు.