అద్భుత కట్టడాలకు.. దశదిశలా కీర్తి..
క్రిస్మస్ పండుగ వస్తుందంటే జంటనగరాలకు కొత్త కళ వస్తుంది. మినీ లండన్‌గా పేర్గాంచిన సికింద్రాబాద్‌లో అయితే విద్యుద్దీపాల వెలుగుల్లో కాంతులీనే చర్చిలు.. నిరంతరం జరిగే ప్రార్థనలతో కళకళలాడుతుంటాయి. ఇక్కడున్న ప్రతి చర్చికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలకులు నిర్మించిన కట్టడాల్లో ఎంతో అందం, గాంభీర్యం తొణికిసలాడుతుంటాయి. ఈ ప్రాంతంలో ఉన్న
ప్రముఖమైన చర్చిల ప్రత్యేకత మీకోసం.. - కంటోన్మెంట్
సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ చర్చి
జంటనగరాల్లో అత్యంత పురాతమైన చర్చి ఇది. లాన్సర్స్ లైన్‌లోని బ్రిటిష్ కుటుంబాలు ప్రార్థన చేసుకునేందుకు వీలుగా 1813లో దీన్ని నిర్మించారు. 1998లో ‘ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అవార్డు’ను దక్కించుకుంది. ఈ చర్చి ఆధీనంలో సుమారు 100 ఎకరాలు ఉండేవి. కాలక్రమేణా అభివృద్ధి కార్యక్రమాలు, ఆక్రమణలతోను కరిగిపోయింది. ప్రస్తుతం చర్చి ప్రధాన కట్టడం, దాన్ని ఆనుకుని ఉన్న స్థలంలో స్కూలు, కాలేజీ ఆవరణ మాత్రమే మిగిలాయి.
సెయింట్ థామస్ ఎస్‌పీజీ చర్చి
సికింద్రాబాద్‌లో పురాతన చర్చిల్లో సెయింట్ థామస్ ఎస్‌పీజీ చర్చి ఒకటి. 1852లో దీన్ని నిర్మించారు. ఈ చర్చికి కు సంబంధించిన స్థలాల్లో చాలావరకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్థలం ఒకప్పుడు ఈ చర్చికి చెందినదే కావడం విశేషం.
మిలీనియం మెథడిస్ట్ చర్చి
మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికు చెందిన మిషనరీస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప్రాంతంలో 1882లో ఈ చర్చిని నిర్మించారు. మెథడిస్ట్ చర్చిగా ప్రారంభమైన ఈ చర్చిని 2001లో పునర్నిర్మించాక మిలీనియం మెథడిస్ట్ చర్చిగా నామకరణం చేశారు.
హోలీ ట్రినిటీ చర్చి
బొల్లారంలో నిజాం స్థలాన్ని కేటాయించగా క్వీన్ విక్టోరియా 1847లో తన సొంత డబ్బుతో హోలీ ట్రినిటీ చర్చిని నిర్మించారు. ఆధునిక కాలంలో బ్రిటిష్ రాణి ఈ చర్చిని సందర్శించారు. తన 36వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు 1983 నగరానికి వచ్చిన క్వీన్ ఎలిజబెత్-2 భర్త ఫిలిప్‌తో కలిసి ఈ చర్చిలో ప్రార్థనలు చేశారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్‌ఐ) ఆధ్వర్యంలో కొనసాగుతోంది.
సెయింట్ మేరీస్ చర్చి
పురాతనమైన, తొలి రోమన్ క్యాథలిక్ చర్చిగా గుర్తింపు ఉంది. చాలాకాలం ఆర్చ్ డయోసిస్ ఆఫ్ హైదరాబాద్ ప్రధాన చర్చిగా కొనసాగింది. ఐరిష్ క్యాథలిక్స్‌తో కలిసి ఫాదర్ డేనియల్ మర్ఫీ 1840లో నిర్మాణాన్ని ప్రారంభించగా 1850లో పూర్తయింది. 1886 వరకు హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ ప్రధాన చర్చిగా కొనసాగింది. చర్చి ఆధ్వర్యంలో సెయింట్ ఆన్స్ హైస్కూలు నిర్వహిస్తున్నారు. దీన్ని ‘బాసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అసెంప్షన్’గా వ్యవహరిస్తారు. రోమన్ క్యాథలిక్ చర్చిల్లో ప్రముఖమైన వాటికి దక్కే ‘బాసిలికా’ గుర్తింపును 2008లో ఇచ్చారు.
ఆల్ సెయింట్స్ చర్చి
తిరుమలగిరిలోని బ్రిటిష్ కంటోన్మెంట్‌లో 1860లో నిర్మాణం పూర్తి చేసుకుంది. తిరుమలగిరిలో ఏర్పాటైన తొలి శాశ్వత కట్టడం కూడా ఇదే. చర్చి ఆఫ్ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో ఆర్మీ కోసం ఈ చర్చిని నిర్మించారు. తొలుత ఆర్మీ మతాధికారుల అధ్వర్యంలో ఈ చర్చి నిర్వహణ కొనసాగేది. స్వాతంత్య్రానంతరం అంగ్లికన్, ప్రొటస్టెంట్ సమ్మేళనంతో ఏర్పాటైన ‘చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా’ (సీఎస్‌ఐ) పరిధిలోకి వచ్చింది.
గ్యారిసన్ వెస్లీ చర్చి
తిరుమలగిరిలో 1853లో నిర్మాణం ప్రారంభించగా, 1883లో అందుబాటులోకి వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం కేవలం ఆర్మీ అధికారుల కుటుంబాలు మాత్రమే ఈ చర్చిలో ప్రార్థనలు చేసేవారు.
వెస్లీ చర్చి
సికింద్రాబాద్‌లోని క్లాక్‌టవర్ సమీపంలో ఈ వెస్లీ చర్చి ఉంది. బ్రిటిష్ మిషనరీస్ రెవరెండ్ విలియం బర్గెస్, రెవరెండ్ బెంజిమన్ ఫ్రాట్ ఆధ్వర్యంలో 1916లో నిర్మితమైంది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు అనుబంధంగా కొనసాగుతోంది.
క్రిస్మస్ జోష్..
నగరంలో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. బుధవారం వివిధ పాఠశాలలు, చర్చిల్లో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. షాపింగ్‌మాల్స్ క్రిస్మస్ శోభతో కళకళలాడుతున్నాయి. అలంకరణ సామగ్రి దుకాణాలు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. - సాక్షి, సిటీబ్యూరో