100 ఎకరాల్లో ఆంగ్లేయులు నిర్మించిన చర్చీ.. తెలంగాణలో రెండో అతి పెద్దది | Luxettipet CSI Church Is The Telanganas Second Biggest Church | Sakshi
Sakshi News home page

Christmas Day: తెలంగాణ100 ఎకరాల్లో ఆంగ్లేయులు నిర్మించిన చర్చీ.. తెలంగాణలో రెండో అతి పెద్దది

Published Sat, Dec 25 2021 11:04 AM | Last Updated on Sat, Dec 25 2021 12:28 PM

Luxettipet CSI Church Is The Telanganas Second Biggest Church - Sakshi

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని చర్చీలు క్రిస్మస్‌ వేడుకల కోసం ముస్తాబయ్యాయి. సంబరాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. యేసు జన్మస్థలంగా భావించే పశువుల పాకలను ఆకట్టుకు నే విధంగా తీర్చిదిద్దారు. ప్రార్థనలు చేసేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రాచీన లక్సెట్టిపేట సీఎస్‌ఐ చర్చికి భక్తుల తాకిడి అధికంగా ఉండనుంది.

సాక్షి, లక్సెట్టిపేట(ఆదిలాబాద్‌): రాష్ట్రంలో మెదక్‌ తర్వాత అతిపెద్ద చర్చిగా చెప్పుకునే లక్సెట్టిపేట సీఎస్‌ఐ చర్చి 86 వసంతాలు పూర్తి చేసుకున్నా నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన ఈ చర్చికి క్రిస్మస్‌కు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేస్తుంటారు.  


ఆదిలాబాద్‌లోని చర్చిలో..

బ్రిటీష్‌ కాలంలో నిర్మాణం.. 
లక్సెట్టిపేట పట్టణానికి సమీపంలో వందెకరాలకు పైగా పచ్చటి పొలాలు, టేకు వనంలో మిషన్‌ కాంపౌండ్‌ ప్రాంతంలో ఆంగ్లేయులు ఈ చర్చిని నిర్మించారు. 1920లో ఇంగ్లాండ్‌కు చెందిన రేవ ఈడబ్ల్యూ లాంట్‌ లక్సెట్టిపేట పట్టణానికి వచ్చి, ఇక్కడే పదేళ్లపాటు మిషనరీ సంస్థలో పనిచేశాడు. 1930లో చర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 95 ఫీట్ల వైశాల్యంతో చర్చి నిర్మాణం, 70 ఫీట్ల వైశాల్యంతో ప్రాంగణం, 46 గొలుసులతో ఉన్న దిమ్మెలు, సుమారు 500 మందికి వసతి కల్పించేవిధంగా ఏర్పాట్లు చేశారు. దీని కోసం ఇంగ్లాండ్‌ నుంచి ప్లాన్‌ తెప్పించాడు. నిర్మాణ పనులు చూసే బాధ్యతను రెవ సీజీ అర్లికి అప్పగించారు.

ఇంగ్లాండ్‌ నుంచి రంగురంగుల అద్దాలు, స్థానికంగా ఉన్న గూడెం గుట్ట, గువ్వల గుట్ట, చిన్నయ్య గుట్ల నుంచి రాళ్లు తెప్పించి, బొట్లకుంటలోని నీటిని చర్చి నిర్మాణానికి ఉపయోగించారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి శిల్పకళాకారులను రప్పించారు. 1935లో రెవ హెచ్‌ బర్డ్‌ చర్చి నిర్మాణం పూర్తి చేయించారు. అనంతరం మిషనరీగా వచ్చిన రేవ ఫాస్పూట్‌ సీఎస్‌ఐ చర్చిగా నామకరణం చేసి క్రిస్మస్‌ రోజున ప్రారంభించారు. అప్పటి నుంచి 1954 వరకు ఆంగ్లేయులే చర్చి ఫాదర్‌లుగా పనిచేశారు. ఫాదర్‌ నివాసం ఉండేందుకు రెండస్తుల విశాలమైన భవంతిని నిర్మించారు. ప్రస్తుతం పనిచేస్తున్న చర్చి ఫాదర్లు కూడా అందులోనే ఉంటారు. 


విద్యుత్‌కాంతుల్లో విజయనగరం చర్చి 

విజయనగరం చర్చికి 55 ఏళ్లు 
కౌటాల(సిర్పూర్‌): మండలంలోని విజయనగరం గ్రామంలోని కథోలిక చర్చికి ఘన చరిత్ర ఉంది. విజయనగరంలో 1966లో దీనిని స్థాపించారు. విశాలమైన ప్రాంతంలో చర్చితోపాటు ఎయిడైడ్‌ పాఠశాల, వసతి గృహం ఉన్నాయి. చర్చికి ప్రతి ఆదివారం 250 వరకు భక్తులు వచ్చి, ప్రార్థనలు నిర్వహిస్తారని ఫాదర్‌ మనోజ్‌ తెలిపారు. 30 ఏళ్ల క్రితం పాత భవనాన్ని తొలగించి, అదేస్థలంలో భారీ మందిరాన్ని నిర్మించారు. క్రిస్మస్‌ సందర్భంగా ప్రత్యేకంగా విద్యుత్‌కాంతులతో చర్చిని ముస్తాబు చేశారు.

ఏర్పాట్లు చేస్తున్నాం 
క్రిస్మస్‌ రోజు లక్సెట్టిపేట సీఎస్‌ఐ చర్చికి భక్తులు అధికంగా వస్తుంటారు. పండుగ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్‌ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి. 
– కరుణాకర్‌రావు,  సీఎస్‌ఐ చర్చి ఫాదర్, లక్సెట్టిపేట 


కలెక్టర్‌ చౌక్‌లో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్‌ ట్రీ

ముస్తాబైన యేసు మందిరాలు
కైలాస్‌నగర్‌(ఆదిలాబాద్‌): జిల్లాకేంద్రంలోని కలెక్టర్‌ చౌక్‌ వద్ద గల హోలీ ఫ్యామిలీ కాథరల్‌ చర్చిలో యేసు జన్మస్థలం పశువుల పాకను అందంగా తీర్చిదిద్దారు. రాత్రి 12 గంటలకు యేసు జన్మను స్వాగతిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఖానపూర్‌లో గల ఇండియా మిషన్‌ చర్చి, రవీందర్‌నగర్‌లోని సీఎస్‌ఐ చర్చి, విద్యానగర్‌లోని బేస్‌ సేబా చర్చిలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా అలంకరణ వస్తువులు సాంటా క్లోస్‌ దుస్తులు, నక్షత్రాలు, రంగురంగుల వస్తువులు కొనుగోళ్లతో షాపింగ్‌ మాల్‌లు, జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు రద్దీగా మారాయి.  


ఆనందంగా గడుపుతాం 
క్రిస్మస్‌ రోజు తప్పకుండా అమ్మనాన్నతో కలిసి అందరం చర్చికి వెళ్తాం. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఆనందంగా గడుపుతాం. కొత్త బట్టలు వేసుకుని, ఇంటిని కూడా అందంగా ముస్తాబు చేస్తాం.  
– డి.ప్రేక్ష, టీచర్స్‌కాలనీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement