
రాజకీయాలనూ శాసిస్తున్నాయ్!
- ప్రైవేటు విద్యాసంస్థల తీరుపై స్వామిగౌడ్
- తమను ముట్టుకుంటే అంతం చేస్తామనే పరిస్థితి ఉందని ధ్వజం
- టెన్త్ పాసైన వ్యక్తులు మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్నారని ఆవేదన
- హైదరాబాద్‌లో ప్రాఫిటింగ్ ఫ్రం ది పూర్ పుస్తకావిష్కరణ
- ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి, చుక్కా రామయ్య తదితరుల హాజరు
సాక్షి, హైదరాబాద్ : ‘‘ప్రైవేటు విద్యాసంస్థలు రాజకీయ రంగాన్నీ శాసించే స్థాయికి చేరాయి. మమ్మల్ని ముట్టుకుంటే ఎవరినై నా అంతం చేస్తామని బెదిరించే స్థాయికి వ చ్చాయి’’ అని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మండిపడ్డారు. ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్(ఈఐ) సంస్థ ఆధ్వర్యంలో విద్య ప్రైవేటీకరణ-వ్యాపారీకరణ అంశంపై పలువురు ప్రొఫెసర్లు పరిశోధించి రూపొందిం చిన ‘ప్రాఫిటింగ్ ఫ్రం ది పూర్’ పుస్తకాన్ని ఆయన ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రైవేటు సంస్థలు భూతాల్లా విస్తరిస్తున్నాయన్నారు.
పదో తరగతి పాస్‌కాని వ్యక్తులు మెడికల్ కళాశాలలను, ఏడో తరగతి చదవని వారు ఇంజనీరింగ్ కళాశాలలను నిర్వహిస్తున్నారంటే ప్రమాణాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవచ్చన్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని, భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈఐ సంస్థ పరిశోధనలో తేలిన అంశాలను ప్రభుత ్వం పరిగణనలోకి తీసుకుంటుందని, అందరికీ నాణ్యమైన విద్యను అందించే దిశగా సహకారం అందిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి మాట్లాడుతూ విద్య ప్రైవేటీకరణకు అందరం వ్యతిరేకమేనని, సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలన్నారు.
వివిధ సంక్షేమ పథకాల ద్వారా సబ్సిడీలు అధికంగా ఇవ్వడంతో కీలక శాఖలకు నిధుల కొరత ఏర్పడుతోందన్నారు. ఈఐ సూచించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసికెళ్తానన్నారు. కార్యక్రమంలో ఈఐ చీఫ్ కోఆర్డినేటర్ శశిబాలాసింగ్, ప్రాజెక్ట్ డెరైక్టర్ ఆంగ్లియో, రీసెర్చ్ ఫ్రొఫెసర్లు సంగీతా కామత్, జొన్నలగడ్డ ఇందిర, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్, కొంపల్లి యాదవ్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, జాఫ్రీ, మాజీ ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, సుబ్బారెడ్డి, తెలంగాణ, ఏపీలకు చెందిన వివిధ జిల్లాల ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.