హైదరాబాద్ : న్యాయాధికారుల సస్పెన్షన్ సమంజసం కాదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆప్షన్ అడిగినప్పుడే సీఎం కేసీఆర్ స్పందించి ఉండాల్సిందని ఆయన అన్నారు. బుధవారం హైదరాబాద్లో టి. జీవన్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు సద్దుమణిగిన విధంగా హైకోర్టు విభజన సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఆయుత చండీయాగానికి రావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానించిన సంగతి ఈ సందర్భంగా టి.జీవన్ రెడ్డి గుర్తు చేశారు.
అయితే హైకోర్టు విభజనపై చంద్రబాబుతో ఎందుకు మాట్లాడలేదని కేసీఆర్ను ప్రశ్నించారు. హైకోర్టు విభజన జరిగేంత వరకు న్యాయాధికారుల విభజన ఆపాలని కేంద్రప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏ ప్రాంతం వారిని ఆ రాష్ట్రానికే కేటాయించాలన్నారు. కేసీఆర్ భేషజాలకు పోకుండా ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడకుండా హైకోర్టు విభజన సమస్య పరిష్కారం కోసం చంద్రబాబుతోనూ కేంద్రంతోనూ చర్చించాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ రాజేసే విధంగా ఇద్దరు సీఎంలు వ్యవహరించడం సరికాదని టి.జీవన్రెడ్డి పేర్కొన్నారు.