ఆ బట్టీ యాజమానులపై చర్యలు తీసుకోండి
ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కార్మికుల వేతనాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయని బట్టీ యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు హైకోర్టు తేల్చి చెప్పిం ది. ఈ విషయంలో వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఫలితం ఉండదని, వారిపై తీసుకున్న చర్యలను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన ఇద్దరు కార్మికుల చేతులను నరికివేసిన ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు 2014లో సుమోటోగా విచారణ చేపట్టింది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికుల దుస్థితిపై అటు ఒడిస్సా, ఇటు తెలంగాణ ప్రభుత్వాల నుంచి నివేదికలు తెప్పించుకుంది. వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు, ఈ వ్యవహారంపై ఆయా రాష్ట్రాల హైకోర్టులు విచారణ చేపట్టడం మేలని భావించి, వ్యాజ్యాన్ని ఒడిస్సా, ఉమ్మడి హైకోర్టులకు బదిలీ చేసింది.
ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపిం ది. వేతనాలను కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయని బట్టీ యజమానులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. వారికి నోటీసులిస్తున్నామని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులు చెప్పగా, నోటీసులతో ఒరిగేదేముందని ధర్మాసనం నిలదీసింది. వారిపై తీసుకున్న చర్యలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.