![పాదయాత్రను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/51476478559_625x300.jpg.webp?itok=lxya0U_3)
పాదయాత్రను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
సీఎం స్పష్టం చేయాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: తాము చేపడుతున్న మహాజన పాదయాత్రను వ్యతిరేకిస్తున్నారా లేక తాము ప్రస్తావిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సమస్యలపై ఎజెండాను వ్యతిరేకిస్తున్నారా అన్న విషయాన్ని సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. 2004 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలతో, మళ్లీ 2009 ఎన్నికల్లో మహాకూటమిలో టీడీపీ,సీపీఐ, సీపీఎంలతో టీఆర్‌ఎస్ పొత్తు కుదుర్చుకున్నపుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల విషయంలో సీపీఎం తీసుకున్న నిర్ణయం గుర్తుకు రాలేదా అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిలదీశారు. తాము ఏనాడూ తెలంగాణను వ్యతిరేకించలేదని, పార్టీ విధానానికి అనుగుణంగా వ్యవహరించామన్నారు.
శుక్రవారం ఎంబీ భవన్‌లో పార్టీనాయకులు బి.వెంకట్, డీజీ నరసింహారావు, టి.సాగర్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీపీఎం పాదయాత్రను అడ్డుకోవాలంటూ అధికారపక్షం పిలుపునివ్వడం అప్రజాస్వామికమన్నారు. కొత్త జిల్లాలను రాజకీయ అవసరాల కోసమే చేశారన్నారు. సామాజిక న్యాయం-సమగ్రాభివృద్ధి కోసం ఈ నెల 17 నుంచి చేపడుతున్న పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమస్యలు తెరపైకి వస్తాయి కనుకనే అధికారపక్షం తమ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.
ముస్లింలకు రంజాన్ సందర్భంగా బిర్యానీ ప్యాకెట్, జత దుస్తులిచ్చి చేతులు దులుపుకోవడంవల్ల వారి సమస్యలు పరిష్కారం కావన్నారు. బీసీలకు కూడా ఏవో ఎంగిలి మెతుకులు వేయడం కాకుండా జనాభా ప్రాతిపదికన వారికి బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలన్నారు.