హైదరాబాద్ : కేరళ ఎన్నికల్లో ఓటమిని భరించలేకనే వామపక్షాలపై మతోన్మాద శక్తులు దాడి చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. డిల్లీలోని సీపీఎం కేంద్రం కమిటీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడిచేసినందుకు నిరసనగా సోమవారం సుందరయ్య పార్కు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో మతోన్మాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..దాడులు చేయటం అమానుషమని, కేరళలో విజయోత్సవం జరుపుకుంటున్న సమయంలో బాంబులు వేస్తే ఒకరు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారని, అక్కడ దుండగులను అరెస్టు చేసినందుకే మళ్లీ ఢిల్లీలో దాడులు చేశారని విమర్శించారు.
దేశంలో సామాజిక, సాంస్కృతిక సంస్థలపై చేస్తున్న దాడిలో భాగంగానే మాపై దాడి చేశారని అన్నారు. ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకమై ఇలాంటి దాడులను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో కూడా ఇలాంటి శక్తులను ఎదుర్కొంటామని, వారిని ఒక్క అడుగు కూడ ముందుకు వేయనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగయ్య, డీజీ.నర్సింగరావు, టి.జ్యోతి, జె.వెంకటేశ్, నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, టి.సాగర్, భూపాల్,ఎస్.రమ, బి.హైమావతి, ఆర్.శ్రీరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
'ఓటమిని భరించలేకనే వామపక్షాలపై దాడి'
Published Mon, May 23 2016 6:53 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement