
ఖాళీ చేయటానికి టీడీపీ బ్రాందీ సీసా కాదు
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించాలని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కలలు కంటున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శించారు.
గురువుకే పంగనామాలు పెట్టిన చరిత్ర కేసీఆర్‌ది: బాబు
టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటిస్తాం..
కేంద్రంలో చక్రం తిప్పుతాం
తెలంగాణలో టీడీపీ అధికారంలోకొస్తే బీసీ నేతకు సీఎం పదవి
బాబుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయించాలని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కలలు కంటున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శించారు. ఖాళీ చేసేందుకు టీడీపీ బ్రాందీ సీసా కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజకీయం అంతా తన వద్దే నేర్చుకున్నారని.. గురువుకే పంగనామాలు పెట్టిన చరిత్ర కేసీఆర్‌ది అని ఆక్రోశం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, పరిగి నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు టీ ఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో.. టీడీపీ కార్యకర్తలు, నేతలకు ధైర్యం చెప్పేందుకు చంద్రబాబు శనివారం ఎన్‌టీఆర్ ట్రస్టు భవన్‌లో పార్టీ జిల్లా విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని 45 సీట్లు కేటాయించటం వల్ల తాము అధికారంలోకి రాలేకపోయామని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్‌తో తెగతెంపులు చే సుకున్న తరువాత గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో 45 మంది కార్పొరేటర్లను గెలుపించుకోగలిగామన్నారు. తనను సీబీఐ కేసుల్లో ఇరికించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీని త్వరలో జాతీయ పార్టీగా ప్రకటిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల్లో టీడీపీ విజయం సాధించడం ద్వారా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే బలహీనవర్గాలకు చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించటం కాంగ్రెస్ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఇదిలావుంటే.. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి శనివారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇటీవలి కాలంలో ఆయన కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు.