
రేషన్ లెక్క.. యాప్‌తో పక్కా
రేషన్ సరుకుల తరలింపు నుంచి పంపిణీ వరకు ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ.. తాజాగా మరో అడుగు ముందుకేసింది.
► రేషన్ షాపు లొకేషన్.. అందులోని సరుకుల వివరాలు లైవ్‌లో..
► రేషన్ సరుకు తరలించే వాహనాల కదలికలు కూడా..
► టీ–రేషన్ మొబైల్ యాప్ రూపొందించిన పౌరసరఫరాల శాఖ
► నేటి నుంచి అందుబాటులోకి.. ఆవిష్కరించనున్న మంత్రి ఈటల
సాక్షి, హైదరాబాద్: రేషన్ సరుకుల తరలింపు నుంచి పంపిణీ వరకు ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత తీసుకొచ్చేలా.. లావాదేవీలు సామాన్య ప్రజలూ ప్రత్యక్షంగా తెలుసుకునేలా ‘టీ–రేషన్’మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ చొరవతో నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) సౌజన్యంతో రూపొందించిన ఈ యాప్ సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.
మంత్రి ఈటల రాజేందర్ యాప్‌ను ఆవిష్కరించనున్నారు. పౌరసరఫరాలకు సంబంధించిన అన్ని లావాదేవీలు యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, శాఖ అధికారులూ తమ రోజువారీ కార్యక్రమాలను నిర్వహించుకునేలా రూపొందించామని కమిషనర్ చెప్పారు. పౌర సేవలకు సంబంధించి 7, ప్రభుత్వ సేవలకు 13 అప్లికేషన్లు కలిపి మొత్తం 20 అప్లికేషన్లతో యాప్‌ను రూపొందించారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏ రోజు ఎంత తీసుకున్నారో..
ఈ యాప్ ద్వారా దగ్గరలోని రేషన్ షాప్ లొకేషన్ గుర్తించవచ్చు. అలాగే షాపులో జరిగే లావాదేవీలూ ప్రత్యక్షం (లైవ్)గా తెలుసుకోవచ్చు. రేషన్ కార్డు దరఖాస్తు స్టేటస్, కార్డు వివరాలు, కార్డుపై ఆ నెల సరుకుల కేటాయింపు వివరాలు, రేషన్ షాపుల్లో సరుకు నిల్వలు, ఏ రేషన్ దుకాణానికి ఎన్ని సరుకులు, ఎంత మొత్తంలో కేటాయించారు, ఎంత మొత్తం తీసుకున్నారు, వాటిలో కార్డుదారులకు ఏ రోజు ఎంత ఇచ్చారు వంటి వివరాలను యాప్‌లో రేషన్ కార్డు నంబర్ నమోదు చేసి తెలుసుకోవచ్చు.
గోదాముల్లో కార్యకలాపాలూ లైవ్‌గా..
యాప్‌ను త్వరలో మరింత అభివృద్ధి చేయబోతున్నామని, రేషన్ సరుకులు తరలించే వాహనాల కదలికలను కూడా ప్రత్యక్షంగా చూసేలా అభివృద్ధి్ద చేయబోతున్నామని కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు. పౌర సరఫరాల భవన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వాహనాల కదలికలను ప్రత్యక్షంగా ఎలా పరిశీలిస్తున్నారో అదేవిధంగా యాప్ ద్వారా ప్రజలు కూడా తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. గోదాముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయబోతున్నామని.. గోదాముల్లో సరుకుల నిల్వలు, లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా మొదలు పంపిణీ వరకు జరిగే ప్రతి లావాదేవీని ప్రజలు తెలుసుకోవచ్చని ఆయన వివరించారు.