సంక్షేమానికి ప్రాధాన్యం | telangana budget given priority to the welfare sector | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి ప్రాధాన్యం

Published Thu, Nov 6 2014 2:51 AM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

సంక్షేమానికి ప్రాధాన్యం - Sakshi

సంక్షేమానికి ప్రాధాన్యం

మొత్తం ప్రణాళికావ్యయంలో పాతిక శాతం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకే
 
సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ముందునుంచీ చెబుతున్నట్లుగానే రాష్ట్ర సంక్షేమ రంగానికి బడ్జెట్‌లో సముచిత ప్రాధాన్యత లభించింది. ప్రణాళిక వ్యయం అయిన రూ.48, 637.90 కోట్లలో దాదాపు 25% ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికల కోసం కేటాయించారు. షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక వాటాగా రూ. 7,579.48 కోట్లను, షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక వాటాగా రూ.4,559.81 కోట్లను ఖర్చు చేయనున్నారు. 36 ప్రభుత్వశాఖలకు  కేటాయించిన మొత్తం నిధుల్లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను జనాభా దామాషా ప్రకారం వర్గీకరించారు.

అలాగే, వివిధ సంక్షేమ శాఖలకు ప్రభుత్వం నేరుగా కేటాయించిన నిధులను పరిశీలిస్తే ఎస్సీల అభివృద్ధిశాఖకు ప్రణాళికేతర వ్యయం కింద రూ. 455.91 కోట్లు, ప్రణాళికా వ్యయం కింద రూ. 2799.95 కోట్లు, ఎస్టీ సంక్షేమ శాఖకు ప్రణాళికేతర వ్యయం కింద రూ.311.53 కోట్లు, ప్రణాళికా  వ్యయం కింద రూ.1237,57 కోట్లు, బీసీ సంక్షేమశాఖకు ప్రణాళికేతర వ్యయం కింద రూ.181.80 కోట్లు, ప్రణాళికా వ్యయం కింద రూ.1840.32 కోట్లు, మైనారిటీ సంక్షేమశాఖకు ప్రణాళికేతర వ్యయం కింద రూ.3.88 కోట్లు,  ప్రణాళికా వ్యయం కింద రూ. 1030 కోట్లు, మహిళా శిశు సంక్షేమశాఖకు ప్రణాళికేతర వ్యయం కింద రూ.56.45 కోట్లు, ప్రణాళికవ్యయం కింద రూ.1442.55 కోట్లు కేటాయించారు.

షెడ్యూల్డ్ కులాల కోసం..: ఎస్సీల సంక్షేమానికి ప్రణాళికావ్యయం కింద కేటాయించిన రూ. 2799.95 కోట్లలో.. విద్యార్థులకు ఉపకారవేతనాల కోసం రూ. 1000 కోట్లు, ఎస్సీ సంక్షేమ వసతిగృహాలకు రూ.93.21 కోట్లు, ఎస్సీ గృహాలకు ఉచిత విద్యుత్ కోసం రూ.174.42 కోట్లు, కళ్యాణలక్ష్మీకి రూ.150 కోట్లు, మారుమూల ప్రాంతాల్లో వసతిగృహాలు, కళాశాలల భవన నిర్మాణానికి రూ.4.61 కోట్లు, సమీకృత వసతి గృహాల కోసం రూ.28.57 కోట్లు, తెలంగాణ స్టడీ సర్కిల్ భవన నిర్మాణంకోసం రూ.4.35 కోట్లను కేటాయించింది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సంస్థకు రూ. రూ.364.48 కోట్ల నిధులను, గురుకుల పాఠశాలల భవన నిర్మాణానికి రూ. 297.98 కోట్లను కేటాయించారు. ఎస్సీ సంక్షేమ అభివృద్ధి పథకానికి రూ.250. 21 కోట్లను కేటాయించింది.

షెడ్యూల్డ్ తెగల కోసం.. : ఎస్టీల సంక్షేమానికి ప్రణాళిక వ్యయం కింద రూ.1237.57 కోట్ల నిధులను ఈ బడ్జెట్‌లో కేటాయించగా, అందులో ఎస్టీ విద్యార్థులకు విద్యాగొడుగు పథకం కింద రూ.156.39 కోట్లు, ఎస్టీల ఆర్థికాభివృద్ధికి రూ. 55 కోట్లు, సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి రూ.17.06 కోట్లు, కొమురం భీమ్ స్మా రక నిధికి రూ.25 కోట్లు, కళ్యాణలక్ష్మి పథకానికి రూ.80 కోట్లు, విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడానికి రూ.200 కోట్లను కేటాయించారు.
 
బీసీల సంక్షేమం.. : బీసీ సంక్షేమానికి ప్రణాళిక వ్యయం కింద రూ. రూ.1840.32 కోట్లను కేటాయించగా.. ఫాస్ట్ కింద ఉపకారవేతనాలకు రూ.342.90 కోట్లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌కు రూ.753.31 కోట్లు, ఈబీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.252, ప్రభుత్వ బీసీ వసతి గృహాల కోసం రూ.52.53 కోట్లు, సంచార తెగల అభివృద్ధి పథకం కింద రూ.57.63కోట్లతో కేటాయించారు.
 
మహిళా,శిశు సంక్షేమం.. : మహిళా,శిశు సంక్షేమానికి ప్రణాళిక వ్యయం కింద రూ. 1,422.53కోట్లను కేటాయించారు. అందులో ఐసీడీఎస్ ప్రాజెక్టుకు రూ.104.45 కోట్లు, బంగారుతల్లికి రూ.11.53 కోట్లు, సమగ్ర శిశురక్షణ సేవల పథకానికి రూ.10.37 కోట్లు, పౌష్టికాహార పథకానికి రూ.132.64 కోట్లు, అమృతహస్తానికి రూ.34.12 కోట్లు కేటాయించారు. అలాగే, వికలాంగుల సంక్షేమం కోసం ప్రణాళిక వ్యయం కింద రూ. 20 కోట్లు కేటాయించారు.

మైనారిటీ సంక్షేమానికి అధిక నిధులు
మైనారిటీల పురోభివృద్ధికి కృషిచేస్తామన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వారి సంక్షేమం కోసం రూ.1,030 కోట్ల నిధులు కేటాయించి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మైనారిటీల విద్యాభివృద్ధి పథకాలు, కార్యక్రమాల కోసమే ఇందులో 60 శాతానికిపైగా నిధులను కేటాయించడం విశేషం. ఉపకార వేతనాల కోసం రూ.100 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఫాస్ట్ పథకం కింద రూ.400 కోట్లను మైనారిటీల కోసం ఈబడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించింది.

దీనితోపాటే బహుళ రంగాల్లో అల్ప సంఖ్యాకవర్గాల అభివృద్ధి పేరుతో కేంద్రం అమలు చేస్తున్న పథకానికి బడ్జెట్‌లో రూ.105 కోట్లను కేటాయించగా, కేంద్ర ప్రభుత్వ ఉపకారవేతనాల పథకానికి రూ.90 కోట్లు, ఇతర సాయానికి రూ.15 కోట్ల నిధులున్నాయి. అల్ప సంఖ్యాకుల రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల భవన నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.51.65 కోట్లను కేటాయించారు. పేద యువతుల వివాహాలకు సాయంగా రూ.51 వేలు అందించేందుకు ఇటీవల ప్రభుత్వం అమలులోకి తెచ్చిన షాదీ ముబార్ పథకానికి  రూ.100 కోట్ల నిధులను కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement