సేఫ్ స్మార్ట్.. | Telangana govt presents over Rs 1 lakh crore maiden budget | Sakshi
Sakshi News home page

సేఫ్ స్మార్ట్..

Published Thu, Nov 6 2014 1:11 AM | Last Updated on Tue, Oct 2 2018 4:41 PM

సేఫ్ స్మార్ట్.. - Sakshi

సేఫ్ స్మార్ట్..

‘గ్రేటర్ నగరాన్ని సురక్షిత (సేఫ్) టెక్నాలజీ వినియోగంతో సుపరిపాలన(స్మార్ట్).. మురికివాడల రహిత(స్లమ్‌లెస్) సిటీగా మార్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది’.  - ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్
 
ప్రజలను తమ పార్టీ వైపు... పెట్టుబడిదారులను రాజధాని వైపు ఆకర్షించే మంత్రం... శాంతిభద్రతలకు అగ్రాసనం... మౌలిక వసతులకు ప్రాధాన్యం... ఇదీ గులాబీ మార్కు బడ్జెట్ స్వరూపం. తెలంగాణ రాష్ట్ర తొట్టతొలి ప్రభుత్వం... మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాజధానికి నిధుల ‘భాగ్యం’ దక్కింది. నేరరహిత రాజధాని దిశగా అడుగులు పడుతుండడం సిటీజనం ఆకాంక్షలను ప్రతిఫలిస్తోంది.
 
బడ్జెట్‌లో రాజధానికి ప్రాధాన్యం
స్లమ్‌ఫ్రీ సిటీ ప్రాజెక్టుకు రూ.250 కోట్లు
జంట కమిషనరేట్లకు రూ.186 కోట్లు
ఆస్పత్రుల అభివృద్ధికి రూ. 564 కోట్లు
జలమండలికి రూ.600 కోట్లు
ఎంఎంటీఎస్- 2కు: రూ. 20.83 కోట్లు
గ్రేటర్ ఆర్టీసికి రూ.  345 కోట్లతో 150 బస్సుల కొనుగోలు
కలల మెట్రోకు రూ. 416 కోట్లు
హెచ్‌ఎండీఏ కోరింది రూ. 2000 కోట్లు ఇచ్చింది 1000 కోట్లు విద్యకు మొండిచెయ్యి
సాక్షి, సిటీబ్యూరో: సేఫ్.. స్మార్ట్ సిటీ దిశగా తొలి అడుగు పడింది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రసంగం తెలంగాణ  రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రాధాన్యాలేమిటో తేటతెల్లం చేసింది. గ్రేటర్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీని బలోపేతం చేసే దిశగా... బస్తీవాసులను తమ వైపు తిప్పుకునేందుకు వీలుగా గులాబీ సర్కారు ప్రణాళిక సిద్ధం చేసింది. తాజా బడ్జెట్‌లో స్లమ్‌ఫ్రీ సిటీకి రూ.250 కోట్లు కేటాయించడం అందులో భాగమేనని విశ్లేషకుల అంచనా.

శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యమిచ్చి... మహానగరాన్ని నేరరహిత రాజధానిగా తీర్చి దిద్దేందుకు... తద్వారా పెట్టుబడులకు స్వర్గధామంగా మలిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తాజా బడ్జెట్ ముఖచిత్రం సుస్పష్టం చేస్తోంది. కాగితాలకే పరిమితమైన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు రూ.90 కోట్లు కేటాయించడం ద్వారా స్మార్ట్‌సిటీ దిశగా ప్రస్థానం మొదలైందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. తాజా బడ్జెట్ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యాలు, వివిధ విభాగాల వారీగా బడ్జెట్ ముఖచిత్రమిదీ...
 
వీటికే అగ్ర తాంబూలం
సేఫ్‌సిటీ: హైదరాబాద్, సైబరాబాద్ జంట కమిషనరేట్లకు సుమారు రూ.186 కోట్లు కేటాయించడం ద్వారా నగరాన్ని నేరరహిత రాజధానిగా మార్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. నేరాల రేటు గణనీయంగా తగ్గితే నగరానికి పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయన్నది సర్కారు భావన.

 స్మార్ట్‌సిటీ: మొన్నటి వరకు కాగితాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టుకు రూ.90 కోట్లు కేటాయించింది. తద్వారా ఐటీ ఆధారిత పరిశ్రమల వృద్ధి, ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
 
స్లమ్‌ఫ్రీ సిటీ: నగరంలోని మురికివాడల్లో కనీస మౌలిక వసతుల కల్పన, రహదారులు, మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించడం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉద్దేశించినదే స్లమ్‌ఫ్రీ సిటీ పథకం ఉద్దేశం. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 1500కు పైగా మురికివాడలున్న విషయం విదితమే. వీటిల్లో దశల వారీగా మౌలిక వసతులు కల్పించాలన్నది సర్కారు లక్ష్యమని బడ్జెట్ చాటిచెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement