సంబురాలకు సిద్ధం | Telangana new districts celebrations soon | Sakshi
Sakshi News home page

సంబురాలకు సిద్ధం

Published Mon, Oct 10 2016 1:18 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

సంబురాలకు సిద్ధం - Sakshi

సంబురాలకు సిద్ధం

రేపే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ప్రారంభం
రాష్ట్ర అవతరణ ఉత్సవాల స్థాయిలో వేడుకలు
అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ముస్తాబైన 21 కొత్త జిల్లాలు
24కు చేరిన డివిజన్లు, 120 మండలాలు
నేడు అత్యవసర మంత్రివర్గ సమావేశం
జిల్లాల తుది ప్రకటనపై చర్చ
సీఎం వద్ద కలెక్టర్లు, ఎస్పీల ఫైళ్లు
దసరా రోజున ఉదయాన్నే తుది నోటిఫికేషన్, ఉత్తర్వులు

 
సాక్షి, హైదరాబాద్: సరికొత్త పాలనా అధ్యాయానికి తెలంగాణ ముస్తాబైంది. చరిత్రాత్మకమైన పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనతో మరో అడుగు ముందుకేసింది. మంగళవారం విజయదశమి పర్వదినాన కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు కొలువుదీరుతున్నాయి. వీటి ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం సర్వ సన్నాహాలు చేసింది. అన్నీ ఒకే సమయానికి ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది.
 
31 జిల్లాలతోనే..!
రాష్ట్రంలో ప్రస్తుతమున్న పది జిల్లాలను 31 జిల్లాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాలపై సీఎం కేసీఆర్ స్వయంగా కసరత్తు చేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులు, సూచనలన్నీ పరిశీలించిన మీదట కొత్తగా 21 జిల్లాలు, 24 రెవెన్యూ డివిజన్లు, 120 కొత్త మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డివిజన్లు, మండలాల్లో మార్పులు చేర్పులు, తుది వరకూ చర్చలు, పరిశీలనలు జరుగుతూనే ఉండటంతో జిల్లాల సంఖ్యలో మార్పులు ఉంటాయనే ఉత్కంఠ నెలకొంది. కానీ ఆవిర్భావ ఉత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లు, 21 కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ఏర్పాటును బట్టి... 31 జిల్లాలతో తుది నోటిఫికేషన్ లాంఛనప్రాయమేనని స్పష్టమవుతోంది. నిర్ణీత ముహూర్తానికి అన్ని జిల్లాలను ప్రారంభిస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. ఏయే జిల్లాను ఎవరు ప్రారంభిస్తారనే వివరాలనూ ప్రకటించారు.
 
రాష్ట్ర అవతరణ వేడుకల స్థాయిలో..
సీఎం కేసీఆర్ స్వయంగా సిద్దిపేట జిల్లా ప్రారంభ వేడుకలకు హాజరవుతారు. కొత్త జిల్లాలకు ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ కూడా పూర్తయింది. ఎస్పీలు, కలెక్టర్లు, జేసీలు మిన హా డీఆర్‌వో, ఆర్డీవోల ఎంపిక పూర్తయింది. అన్ని ప్రభుత్వ శాఖలు తమ జిల్లా అధికారులను ఖరారు చేశాయి. కొత్త జిల్లా కేంద్రాలన్నింటా 54 ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు వీలుగా భవనాలను సిద్ధం చేశారు. తొలి రోజున కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసులను ఘనంగా ప్రారంభిస్తారు. రాష్ట్ర అవతరణ వేడుకల తరహాలోనే జిల్లాల వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అయితే అధికారికంగా తుది నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు అధికారుల పోస్టింగ్‌లు, ఉద్యోగుల కేటాయింపు వివరాలన్నీ వెల్లడించే అవకాశం లేకపోవడంతో మౌఖికంగానే ఆదేశాలు జారీ అయ్యాయి. దసరా రోజునే తుది నోటిఫికేషన్ విడుదల కానుండటంతో సోమవారం అర్ధరాత్రి వరకు  కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నియామకంపై ఆఖరి కసరత్తు కొనసాగనుంది.
 
సీఎం వద్దే కలెక్టర్ల ఫైలు
కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకపు ఫైలు సీఎం తుది పరిశీలనలో ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలకు పాత కలెక్టర్లను కొనసాగించి.. మిగతా జిల్లాలకు నియామకాలు చేయాలని సీఎం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే కొత్త జిల్లాల ఆవిర్భావ వేడుకల హడావుడి నేపథ్యంలో... ప్రస్తుతమున్న జిల్లాల్లో కలెక్టర్లను పదిహేను రోజుల పాటు కొనసాగించి, కేవలం కొత్తగా ఏర్పాటు చేసే 21 జిల్లాలకు ఐఏఎస్, ఐపీఎస్‌లను నియమించాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు తెలిసింది. 2001 నుంచి 2009 వరకు వివిధ బ్యాచ్‌లకు చెందిన ఐఏఎస్ అధికారులు 41 మంది ఉన్నారు.
 
వారిలో ప్రస్తుతం పనిచేస్తున్న పది మంది కలెక్టర్లు మినహా మిగతా వారిలో 27 మంది పేర్లను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపించినట్లు తెలిసింది. సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో పాటు ప్రియదర్శిని, జి.కిషన్, అనితా రామచంద్రన్, బాల మాయాదేవి, సర్ఫరాజ్ అహ్మద్, వెంకట్రామిరెడ్డి, ఎంవీ రెడ్డి, అమ్రపాలి, భారతి హోళికేరి, చంపాలాల్ పేర్లు ఆ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు ఎస్పీల జాబితాను సైతం డీజీపీ కార్యాలయం ముఖ్యమంత్రికి అందజేసింది. సీఎం సూచనల మేరకు ఏ జిల్లాకు ఎవరిని కేటాయించాలనేది నేడు ఖరారు కానుంది.
 
రెవెన్యూ డివిజన్‌గా షాద్‌నగర్
ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న షాద్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని, ఇదే నియోజకవర్గంలోని నందిగామను మండలం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆదివారం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కొత్తూరు, కేశంపేట, ఫరూక్‌నగర్, కొందుర్గు, చౌదరిగూడెంతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే నందిగామ మండ లం, షాద్‌నగర్ మున్సిపాలిటీతో కలిపి రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. దీనిపై కేసీఆర్ అప్పటికప్పుడే మహబూబ్‌నగర్, రంగారెడ్డి కలెక్టర్లతో మాట్లాడి.. జనాభా, విస్తీర్ణం తదితర వివరాలు తెప్పించుకున్నారు. ఈ రెండు ప్రతిపాదనలు ఆమోదయోగ్యమేనని తేలడంతో ఏర్పాటుకు అంగీకరించారు.
 
పాత కార్యాలయాలను తరలించొద్దు
కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు నేపథ్యంలో అవసరమైన కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సిందే తప్ప ఇప్పటికే ఉన్న కార్యాలయాలను తరలించవద్దని సీఎం కేసీఆర్ సీఎస్ రాజీవ్‌శర్మను ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లోని ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తారనే ప్రచారం జరుగుతోందని మంత్రి లక్ష్మారెడ్డి, ములుగు నుంచి కార్యాలయాలను తొలగించవద్దని మంత్రి చందూలాల్, మరిపెడలో కార్యాలయాలను మార్చొద్దని మాజీ మంత్రి రెడ్యానాయక్‌లు సీఎంను కోరారు.  ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ మేరకు సీఎస్‌ను ఆదేశించారు.
 
నేడు కేబినెట్ భేటీ
జిల్లాల పునర్విభజనకు సంబంధించి సోమవారం రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కానుంది. రెండ్రోజుల కింద జరిగిన కేబినెట్ భేటీలో 31 జిల్లాలకు ఆమోదం తెలిపారు. అయితే తాజాగా షాద్‌నగర్‌ను కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయటంతో పాటు అదే డివిజన్ పరిధిలోని నందిగామను మండలంగా ఏర్పాటు చేయాలని ఆదివారం రాత్రి నిర్ణయించడం గమనార్హం. ఈ తరహాలో జరిగిన తుది మార్పులపై మరోసారి కేబినెట్ ఆమోద ముద్ర వేసి తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కేబినెట్ సమావేశం జరుగకున్నా.. ఫైలును మంత్రుల సంతకాలతో ఆమోదించి ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. సోమవారం అర్ధరాత్రి తర్వాత తుది నోటిఫికేషన్ విడుదల చేసి.. ఆ వెంటనే కలెక్టర్లు, ఎస్పీల నియామకపు ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి.
 
కొత్త జిల్లాల్లో 54 కార్యాలయాలు

కొత్త జిల్లా కేంద్రాల్లో తొలి రోజున కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభిస్తారు. మొత్తంగా 54 ప్రభుత్వ ఆఫీసులకు భవనాలు సిద్ధమయ్యాయి. కలెక్టరేట్, ఏడీ సర్వే, పోలీస్ హెడ్‌క్వార్టర్స్, విజిలెన్స్ కంట్రోల్ రూమ్, ట్రెజరీ, వ్యవసాయ శాఖ, హౌజింగ్ పీడీ, డీఈవో, సీపీవో, డీపీఆర్‌వో, డీఎస్‌వో, డీఎం సివిల్ సప్లయీస్, గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్, రూరల్ డెవలప్‌మెంట్ పీడీ, జిల్లా రిజిస్ట్రార్, పశు సంవర్థక శాఖ జేడీ, మత్స్యశాఖ, డీఎంహెచ్‌వో, డీడీ సోషల్ వెల్ఫేర్, డీటీడబ్ల్యువో, ఎస్సీ బీసీ కార్పొరేషన్, డిసేబుల్డ్ వెల్ఫేర్, డీడీ మైనారిటీ వెల్ఫేర్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్, డీడీ మైన్స్, డీడీ భూగర్భజల శాఖ, డీడీ వయోజన విద్య, యువజన సర్వీసుల సీఈవో, ఉపాధి కల్పన అధికారి, మార్కెటింగ్ ఏడీ, డీపీవో, డీసీటీపీ, ఐసీడీఎస్ పీడీ, ఆడిట్ ఆఫీసర్, ఫైర్, డీసీవో, ఎస్‌ఈ పీఆర్, ఈఈ ఆర్‌డబ్ల్యూఎస్, ఎస్‌ఈ ఆర్‌అండ్‌బీ, ఎస్‌ఈ ఇరిగేషన్, ఈఈ ఐబీ, డీఐసీ జనరల్ మేనేజర్, ఎక్సైజ్, ఈఈ పీహెచ్, ఆర్‌ఐవో, ఎలక్ట్రిసిటీ, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్, జేసీ క్యాంప్ ఆఫీస్, డీఆర్‌వో క్యాంపు ఆఫీస్‌ల ఏర్పాటుకు వీలుగా భవనాలు సిద్ధమయ్యాయి. శాఖల పునరేకీకరణ, శాఖల సరళీకరణకు అనుగుణంగా ఈ భవనాలను సర్దుబాటు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement