సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం మంగళవారం ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రులందరికీ పంపి ఆ తర్వాత ఆన్‌లైన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఈ ప్రతిపాదనలకు 13 జిల్లాల కలెక్టర్లు ఆమోదం తెలిపారు. రాష్ట్ర స్థాయి కమిటీ సిఫారసులను జిల్లా కలెక్టర్లకు పంపి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌ప్రసాద్ ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ ప్రతిపాదనలకు కలెక్టర్లందరూ ఆమోదం తెలిపారు. ఇంకా ఏవైనా అంశాలుంటే తుది నోటిఫికేషన్ ఇచ్చేలోగా తెలియచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. 1974 ఏపీ డిస్ట్రిక్ట్ (ఫార్మేషన్) చట్టం ప్రకారం కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.
పాలన మరింత చేరువ...
పరిపాలనా సౌలభ్యం.. ప్రజలకు సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు సహా పలు సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక అడుగు ముందుకేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేస్తూ పునర్‌వ్యవస్థీకరణకు నడుం బిగించారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో గతంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసుల మేరకు 26 జిల్లాలుగా పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి జగన్ ఆమోదించారు.
ఈ నేపథ్యంలో జిల్లాలను పునర్‌వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రజలు, ప్రజాసంఘాల నుంచి ఫిబ్రవరి 26 వరకు అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయం మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి అంటే ఏప్రిల్ 2వతేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
జన గణన మొదలయ్యేలోగా..
పాలనా సౌలభ్యం, సత్వర సేవల కోసం లోక్‌సభ నియోజక వర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని గతంలో ప్రణాళిక సంఘం సిఫార్సు చేసింది. ఇదే ప్రాతిపదికన ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలు జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించాయి. తెలంగాణ రాష్ట్రం కూడా జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సుదీర్ఘ కసరత్తు చేసింది. ఈలోపు 2021 జనాభా గణన అంశం ముందుకు రావడంతో కొంత ఆలస్యమైంది. కరోనా వల్ల ఇప్పటికీ జనాభా గణన ప్రారంభం కాలేదు. అది ప్రారంభమయ్యేలోగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఇలా..
► ఒక నియోజకవర్గం మొత్తాన్ని ఒకే జిల్లాలోకి తేవాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది. సగటున 18 నుంచి 20 లక్షల జనాభాతో ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని పేర్కొంది.
► శ్రీకాకుళం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలతోపాటు విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి శ్రీకాకుళం జిల్లాగా ఏర్పాటు చేయాలి.
► ఎచ్చెర్ల మినహా విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలకు విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలోని శృంగవరపు కోట శాసనసభ స్థానాన్ని కలిపి విజయనగరం జిల్లా ఏర్పాటు చేయాలి.
► శృంగవరపు కోట మినహా విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలోని మిగతా ఆరు నియోజకవర్గాలతో విశాఖపట్నం జిల్లాను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలో ఉన్న పెదగంట్యాడ మండలాన్ని విశాఖ జిల్లా పరిధిలోకి తేవాలి.
► అనకాపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో కొత్తగా అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేయాలి.
► అరకు లోక్‌సభ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించాలి. పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాలతో పార్వతీపురం జిల్లాను ఏర్పాటు చేయాలి. రంపచోడవరం, పాడేరు, అరకు వ్యాలీ నియోజకవర్గాలతో కలిపి పాడేరు కేంద్రంగా కొత్తగా అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలి. బ్రిటీషు సర్కార్‌కు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం అల్లూరి సీతారామరాజు పోరాటం చేసిన ఆ ప్రాంతం ఆ మహనీయుడి పేరుతోనే జిల్లా ఏర్పాటు కానుంది.
► అమలాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు.
► కాకినాడ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కాకినాడ జిల్లా ఏర్పాటు.
► రాజమహేంద్రవరం కేంద్రంగా రాజమండ్రి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో తూర్పు గోదావరి జిల్లా ఏర్పాటు.
► ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో ఏలూరు కేంద్రంగా జిల్లా ఏర్పాటు.
► నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటు.
► మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కలిపి మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా ఏర్పాటు.
► విజయవాడ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కలిపి విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు. ఇక్కడ జన్మించిన దివంగత ఎన్టీఆర్ అటు సినీ హీరోగా, ఇటు రాజకీయపార్టీ నేతగా చేసిన సేవలను స్మరించుకుంటూ విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
► గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో కలిపి గుంటూరు జిల్లా ఏర్పాటు.
► బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని సంతనూతలపాడు ఒంగోలుకు సమీపంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యం కోసం సంతనూతలపాడు మినహా బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పాటు. భావ నారాయణస్వామి వెలిసిన బాపట్ల కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు భావపురిగా పేరు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
► నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది.
► ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకర్గాలకు బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని సంతనూతలపాడు శాసనసభ స్థానాన్ని కలిపి ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా ఏర్పాటు.
► తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరుకు సమీపంలో ఉంటుంది. ప్రజల సౌకర్యం కోసం నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలు, తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని సర్వేపల్లితో కలిపి నెల్లూరు కేంద్రంగా శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా ఏర్పాటు.
► సర్వేపల్లి శాసనసభ స్థానం మినహా తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని చంద్రగిరి శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన.
► చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం పోనూ చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ స్థానాలకు రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని పుంగనూరును చేర్చి చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లా ఏర్పాటు.
► పుంగనూరు శాసనసభ నియోజకవర్గంపోనూ రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో రాయచోటి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని తన పాటతో సేవించిన వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులను స్మరించుకుంటూ రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
► కడప లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కడప కేంద్రంగా వైఎస్సార్ జిల్లా ఏర్పాటు.
► నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని పాణ్యం శాసనసభ నియోజకవర్గం కర్నూలుకు సమీపంలో ఉంటుంది. ప్రజల సౌకర్యం కోసం కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకు పాణ్యం శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి కర్నూలు జిల్లా ఏర్పాటు ప్రతిపాదన.
► పాణ్యం మినహా నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో నంద్యాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు.
► హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని రాప్తాడు నియోజకవర్గం అనంతపురానికి సమీపంలో ఉంటుంది. ప్రజల సౌకర్యం కోసం అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలకు రాప్తాడు శాసనసభ స్థానాన్ని కలిపి అనంతపురం జిల్లా ఏర్పాటు ప్రతిపాదన.
► రాప్తాడు మినహా హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటు. శ్రీసత్యసాయిబాబా సేవలను స్మరించుకుంటూ పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
11 జిల్లాలు ఆంగ్లేయుల హయాంలోనే..
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిలాల్లో 11 ఆంగ్లేయుల హయాంలో ఏర్పాటైనవే. స్వాతంత్య్రం వచ్చాక పరిపాలన సౌలభ్యం కోసం గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలతో ఒంగోలు కేంద్రంగా 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా ఆవిర్భవించింది. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో విజయనగరం కేంద్రంగా 1979 జూన్ 1న చివరిగా విజయనగరం జిల్లా ఏర్పాటైంది.
రెవెన్యూ డివిజన్లూ పునర్ వ్యవస్థీకరణ..
రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్ అతి పెద్దది. 33 మండలాలు ఇందులో ఉంటాయి. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా పది నుంచి 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment