అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు
కేసీఆర్ సర్కారుపై తెలంగాణ టీడీపీ నేతల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాల సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ.. కేసీఆర్ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని టీ టీడీపీ నేతలు పేర్కొన్నారు. తెలంగాణలో కరువు, రైతుల ఆత్మహత్యలపై కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు శనివారం టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ విపక్ష ఎమ్మెల్యేలను కొనడం మాని.. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు.కేసీఆర్ విపక్ష ఎమ్మెల్యేలను కొనడం మాని.. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలపై చేస్తున్న ఆరోపణలు కేసీఆర్ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్ నుంచి తామేమీ అద్భుతాలు కోరుకోవడం లేదని, జరగాల్సినవి సక్రమంగా జరిగితే చాలన్నారు. కేసీఆర్ సొంత పత్రికలో కూడా రైతుల ఆత్మహత్యల వార్తలు వస్తున్నాయని, రైతుల ఆత్మహత్యలను హేళన చేయవద్దని సూచించారు.
అసెంబ్లీని నడవనీయం
పేదలకు చెందిన ఒక్క రేషన్‌కార్డు తొలగించినా.. పింఛన్లలో కోత విధించినా అసెంబ్లీ నడవనీయకుండా సీఎం కేసీఆర్ అంతుచూస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు. అరెస్టులను నిరసిస్తూ శనివారం గాంధీనగర్ పోలీసు స్టేషన్ ఆవరణలో టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు మాట్లాడారు. ప్రజల పక్షాన పోరాడుతున్న తమను సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పోలీసులతో అరెస్టులు చేయిస్తుండటం దారుణమన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే టీడీపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికల్లో గెలిపించుకొవాలని సవాల్ విసిరారు.