కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులను పూర్తిగా తాత్కాలిక పద్ధతిలో జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
⇒ తుది కేటాయింపు ఉత్తర్వులు తర్వాతే..
⇒ ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
⇒ కొత్త జిల్లాలకెళ్లినా ఇదివరకటి స్థానికతే కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులను పూర్తిగా తాత్కాలిక పద్ధతిలో జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తుది కేటాయింపులపై ఉత్తర్వులు తర్వాత జారీ చేస్తామని వెల్లడించింది. స్థానికత విషయంలో ఉద్యోగులు ఇదివరకటి జిల్లా/జోనల్/మల్టీజోనల్ కేడర్‌లకు యథాతధంగా కొనసాగుతారని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు నేపథ్యంలో జిల్లాలకు పోస్టులు, ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.కృష్ణారావు శనివారం అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్ జారీ చేశారు. వివరాలు...
1. కొత్త జిల్లాల పరిధిలోని గ్రామాలు, పట్టణ స్థానిక సంస్థలు, మండలాలు, డివిజన్లలోని కార్యాలయాలకు సంబంధించి అన్ని పోస్టులు నిబంధనల మేరకు పునర్ కేటాయింపులు జరిపే వరకు కొత్త జిల్లాల్లో యథాతథంగా కొనసాగుతాయి.
2. జిల్లా కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంతో సహా అన్ని శాఖల జిల్లా కార్యాలయాల పోస్టులు, అదే విధంగా సబ్ జిల్లా కార్యాలయాల పోస్టులను రివైజ్డ్ స్టాఫింగ్ ప్యాటర్న్ ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయించాలి. కొత్త జిల్లాల్లో పని ఒత్తిడి, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని సంబంధిత శాఖలు కొత్త జిల్లాల మధ్య పోస్టుల పంపకాలు జరపాలి.
3. 1, 2 పేరాల్లో పేర్కొన్న పోస్టుల కేటాయింపుల కోసం సంబంధిత శాఖలు సమర్పించిన ప్రతిపాదనల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అనుమతితో ఆ శాఖ తుది కేటాయింపుల ఉత్తర్వులు జారీ చేయనుంది. సంబంధిత శాఖలు తమ శాఖ మంత్రి ఆమోదంతో ఆర్థిక శాఖ, ప్రధాన కార్యదర్శికి ప్రతిపాదనలు పంపించాలి.
కొత్త పోస్టులను సృష్టించాల్సిన అవసరం ఏర్పడితే రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కోసం బిజీనెస్ రూల్స్ ప్రకారం సాధారణ ప్రక్రియను అనుసరించాలి.
పని కోసం తాత్కాలిక ఉత్తర్వులు
5. కొత్త జిల్లాల ఏర్పాటు రోజు నుంచి పునర్ కేటాయింపు అవసరం లేని ‘పేరా 1’లోని ఉద్యోగులు తమ కార్యాలయాల్లో, పోస్టుల్లో యథాతథంగా కొనసాగాలి. వీరిని కొత్త జిల్లాలకు తాత్కాలికంగా కేటాయించినట్లు భావించాలి.
6. పేరా 2లో పేర్కొన్న ఉద్యోగులు ‘ప్రొవిజనల్ ఆర్డర్ టూ సర్వ్’ పద్ధతిలో కొత్త జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుంది. తుది కేటాయింపుల కోసం మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయనుంది.
7. పరిపాలన అవసరాల దృష్ట్యా పేరా 1లోని ఉద్యోగులకి సంబంధించిన సాధారణ ఉత్తర్వులు, పేరా 2లోని ఉద్యోగులకి సంబంధించిన తాత్కాలిక ఉత్తర్వులను సంబంధిత శాఖల కార్యదర్శులు జారీ చేయాలి.
8. పై కేటాయింపుల సందర్భంగా బదిలీలు, కొత్త ప్రాంతానికి స్థానచలనం, లేక ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు బదిలీ చేయాల్సిన పరిస్థితులు రానున్న నేపథ్యంలో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధంతో పాటు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని క్లాజ్ 5(1)కి ప్రభుత్వం సడలింపులు కల్పించనుంది. బదిలీ పొందే ఉద్యోగులకు అర్హత మేరకు బదిలీ భత్యాన్ని ప్రభుత్వం చెల్లించనుంది.
9. కొత్త జిల్లాలకు తాత్కాలికంగా కేటాయించిన ఉద్యోగులు, ‘తాత్కాలిక ఆర్డర్ టూ సర్వ్’ పద్ధతిలో కేటాయించిన ఉద్యోగుల స్థానికత.. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇదివరకటి జిల్లా/జోనల్/మల్టిజోనల్ కేడర్‌లకు యథాతధంగా కొనసాగుతుంది. సీనియారిటీ, పదోన్నతులు, ఇతర సర్వీసు విషయాల్లో పాత కేడర్ యథాతధంగా వర్తించనుంది. పరిపాలన సౌల భ్యం, ప్రజా ప్రయోజనాల కోసం తాత్కాలిక కేటాయింపులు.. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన జారీ చేయనుంది.