మూడేళ్లలో కోటి మందికి ఉద్యోగాలు
ప్రసూతి సెలవులు 12 నుంచి 26 వారాలకు పెంపు: దత్తాత్రేయ
హైదరాబాద్: దేశవ్యాప్తంగా వచ్చే మూడేళ్లలో టెక్స్‌టైల్, గార్మెంట్ రంగాల్లో కోటి మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనల శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. టెక్స్‌టైల్, అపెరల్ రంగాల్లో కేంద్రం రూ.6 వేల కోట్ల పెట్టుబడులు, రాయితీల ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు తెలి పారు. ఈ రంగంలో 75 శాతం మహిళలకే అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. శనివారం ఈపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయం లో విలేకరులతో దత్తాత్రేయ మాట్లాడారు. ఫ్యాషన్ టెక్నాలజీని అనుసరించి ఉత్పత్తులు తయారు చేసుకోవడానికి మహిళలకు అవకాశాలు కల్పిస్తామన్నారు. టెక్స్‌టైల్, అపెరల్ విధానానికి సంబంధించి రాష్ట్రం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం తరఫున అత్యధిక సహాయం అందేలా చూస్తా నన్నారు. చేనేత కార్మికులు అత్యధికంగా ఉన్న పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట తదితర ప్రాంతాలపై ప్రత్యేక ప్రణాళికలు అందజేయాలన్నారు. మహిళలకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచుతున్నట్లు దత్తాత్రేయ వెల్లడించారు.
ఐటీలో 18 లక్షల మందికి ఉపాధి
చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి యువతకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు దత్తాత్రేయ వెల్లడించారు. స్టార్టప్, స్టాండప్ కింద రూ.10వేల కోట్ల పెట్టుబడులు పెట్టి 18లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించామన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కొత్తగా ఉద్యోగులను చేర్చుకుంటే వారికి భవిష్యనిధి డబ్బును కేంద్రమే చెల్లిస్తుందన్నారు. పరిశ్రమల ఉత్పత్తి పెంచడం కోసం పనిగంటలను పెంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. దేశాభివృద్ధి కోసమే ఎఫ్‌డీఐలను వందశాతం ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రశ్నకు బదులుగా దత్తాత్రేయ స్పష్టం చేశారు. సమావేశం అనంతరం తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధులు దత్తాత్రేయను కలసి లండన్‌లో జూలై 17న నిర్వహించే బోనాల జాతరకు రావాల్సిందిగా ఆహ్వానించారు.