
రాధిక.. ఎదురులేదిక!
⇒ ఆస్ట్రేలియాలో ‘ఆస్సీ 10 పీక్ చాలెంజ్’ పూర్తి
⇒ రెండు రోజుల్లో పది పర్వతాల అధిరోహణ
⇒ ఈ ఘనత సాధించిన తొలి పోలీసు అధికారిగా రికార్డు
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేట పోలీసు ట్రైనింగ్ కాలేజీ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న జీఆర్ రాధిక అరుదైన రికార్డు సృష్టించారు. శుక్ర, శనివారాల్లో ఆస్ట్రేలియాలో ‘ఆస్సీ 10 పీక్ చాలెంజ్’ పూర్తి చేశారు. దేశంలో ఈ రికార్డు సాధించిన తొలి పోలీసు అధికారి రాధిక కావడం గమనార్హం. ఆ దేశంలో ఉన్న 10 ఎల్తైన పర్వత శ్రేణుల్ని ఏకబిగిన అధిరోహించడాన్ని ‘ఆస్సీ 10 పీక్ చాలెంజ్’ అంటారు. శుక్రవారం ఆరు పర్వతాల్ని అధిరోహించిన రాధిక శనివారం మరో నాలుగింటిని ఎక్కారు.
ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మౌంట్ కొసిఉజ్కో అధిరోహించడంతో ఈ చాలెంజ్ పూర్తయింది. 2015లో మౌంట్ కున్ ఎక్కిన రాధిక ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. గత ఏడాది మేలో ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి మహిళా పోలీసు అధికారిణిగా రికార్డుల్లోకి ఎక్కారు. గత ఏడాది ఆగస్టులో టాంజానియాలో ఉన్న మౌంట్ కిలిమంజారో ఎక్కారు. ఇప్పుడు 2 రోజుల్లో ఆస్ట్రేలియాలో ఉన్న 10 పర్వతాలను అధిరోహించి మరో రికార్డు సృష్టించారు.