అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
♦ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన
♦ దళిత గ్రామాలన్నిటికీ సిమెంటు రోడ్లు
♦ రెసిడెన్షియల్ స్కూళ్లుగా ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, దళితుల ఉన్నతికి ఎంతో కృషి చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా నూతన రాజధాని అమరావతిలో 125 అడుగుల ఎత్తై అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని సీఎం మంగళవారం అసెంబ్లీలో స్టేట్‌మెంట్ చదివి వినిపించారు. ‘అమరావతిలో 15 ఎకరాల విస్తీర్ణంలో అంబేడ్కర్ స్మృతి వ నం, బౌద్ధుల ధ్యానకేంద్రం, గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తాం. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణకు నా అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తాం.
మా ప్రభుత్వం దళితుల అభివృద్ధికి కృషి చేస్తోంది. రానున్న ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ కాలనీలన్నిటికీ సిమెంట్లు రోడ్లు వేస్తాం. సాంఘిక, గిరిజన సంక్షేమ హాస్టళ్లన్నిటినీ రెసిడెన్షియల్ స్కూళ్లుగా మారుస్తాం. అంబేడ్కర్ జయంతి రోజున 6 లక్షల మంది పేదలకు గృహాలు నిర్మించే పనికి శ్రీకారం చుడుతున్నాం..’ అని సీఎం చెప్పారు. ఏడాదిలో ఎన్టీఆర్ సుజల కింద అన్ని దళిత గ్రామాలకు తాగునీరు అందిస్తామని, ప్రస్తుతం ఉన్న రెండు బల్బులు కాకుండా, మరో రెండు ఎల్‌ఈడీ బల్బులు ఇస్తామని అన్నారు. 50 యూనిట్ల వరకు కరెంటు చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. సమాజంలో రెండే కులాలున్నాయని, ఒకటి డబ్బున్న కులం, మరొకటి డబ్బులేని కులం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.