రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క విమర్శించారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క విమర్శించారు. బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడుతూ 40 లక్షల మంది విద్యార్థులను గురుకుల పాఠశాలల్లో పెట్టి నిర్బంధ విద్య అందించే కేజీటూ పీజీ పథకం ఎంతవరకు వచ్చిందన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు పథకం కింద ఒక్కో సంవత్సరానికి 4లక్షల ఇళ్ల చొప్పున రూ.22 వేల కోట్లతో పనులు జరగాలని, ఇప్పటి వరకు ఎంత కేటాయించారని ప్రశ్నించారు. రుణమాఫీని ఏకమొత్తంలో పూర్తిచేయాలంటే విడతల వారీగా ఇస్తున్నారని, రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నారన్నారు.
51 శాతం ఉన్న బీసీలకు రూ.2,538 కోట్లు కేటాయింపులు జరిపారని, సీఎం మాత్రం ప్రత్యేక అభివృద్ధి నిధి పేరుతో రూ.5 వేల కోట్లు తనవద్ద ఉంచుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించలేదని విమర్శించారు. రీ డిజైనింగ్ పేరుతో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేర్ల మీద లక్షల కోట్లు వృధా చేస్తున్నారన్నారు. ఎత్తిపోతల పథకాలు పూర్తికాలేదని, కొత్త ప్రాజెక్టులపై స్పష్టత లేదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ తాము ఎన్నికల హామీల్లో ఐదేళ్లకే పూర్తిచేస్తామని చెప్పలేదని, అసత్యాలు చెప్పవద్దని హితువు చెప్పారు. ప్రజలు ఎన్నుకొనేది ఐదేళ్లకేనని భట్టి బదులిచ్చారు.