రుణాల మంజూరులో బ్యాంకర్ల సహకారం లేదు
♦ 193వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
♦ డిపాజిట్లు లేకుండా రైతులకు రుణాలు మంజూరు చేయాలని సూచన
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాల మంజూరులో బ్యాంకర్ల నుంచి సహకారం లభించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.3 లక్షల్లోపు రుణాలను ఎలాంటి పూచీకత్తు లేకుండా పంపిణీ చేయాలని ఎస్‌ఎల్‌బీసీ(రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ)లో తీసుకున్న నిర్ణయాన్నే బ్యాంకర్లు అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లో సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 193వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ డిపాజిట్లతో నిమిత్తం లేకుండా స్వల్ప కాలిక రుణాలు మంజూరు చేయాలని సూచించారు.
దేశ వ్యాప్తంగా ముద్రా బ్యాంకు ద్వారా పూచీకత్తు లేకుండా రూ.10 లక్షల వరకూ రుణాలను మంజూరు చేస్తున్నారని వివరించారు. రైతులకు బ్యాంకర్లు ఉదారంగా రుణాలు మంజూరు చేస్తే వ్యవసాయ రంగంలో రెండంకెల వృద్ధి రేటు సాధించడం ఖాయమన్నారు. కరవు రహిత ప్రాంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి జూన్ నాటికి పది లక్షల సేద్యపు కుంటలను తవ్వడంతోపాటూ, లక్ష రెయిన్ గన్స్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కరవు బారి నుంచి రాష్ట్రా న్ని శాశ్వతంగా కాపాడటానికి బ్యాంకర్లు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో బ్యాంకులకు కన్సల్టెంట్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల మహిళల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.