రాయదుర్గం : ఎన్నికల సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా రైతులకు చెందిన అన్ని రకాల రుణాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎలాంటి షరతులు లేకుండా వెంటనే మాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి చేయకుండా తక్షణం ఆదేశాలు జారీ చేయాలన్నారు.
శనివారం సాయంత్రం ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు డిమాండ్ చేశారు. రైతు రుణాలు మాఫీ చేస్తానని, తొలి సంతకం ఆ ఫైలుపైనే చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, దానిపై కమిటీ వేయడానికి దస్త్రాలపై సంతకం పెట్టి, మొదటి సంతకంతోనే రైతులను మోసం చేశాడని ధ్వజమెత్తారు. రుణ మాఫీ హామీ ఇవ్వడం వల్లే రైతులు టీడీపీకి అధికారం కట్టబెట్టారని, ఇపుడేమో కమిటీల పేరుతో కాలయాపన చేసి దగా చేయాలని ప్రయత్నిస్తే, రైతుల తరఫున ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్‌సీపీ ఆందోళన చేయడానికి సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు.
ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, వెంటనే పంట రుణాలతో పాటు, బంగారు నగలు తాకట్టు పెట్టి పొందిన రుణాలు, వ్యవసాయం కోసం తీసుకున్న ట్రాక్టర్ల రుణాలను కూడా మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు కూడా బ్యాంకులకు ఎలాంటి రుణాలను చెల్లించవద్దని ఆయన పిలుపునిచ్చారు. అలాగే రైతుల ఖాతాల్లో ఉన్న పొదుపు లేదా డిపాజిట్ల సొమ్మును బ్యాంకర్లు రుణాలకు జమ చేసుకోకుండా బ్యాంకుల్లో ఉన్న నగదును డ్రా చేసుకోవాలని సూచించారు.
సబ్సిడీ ధరతో వెంటనే విత్తన వేరుశనగ, ఎరువులు అందించాలని, డ్వాక్రా రుణాలు సైతం ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువతకు నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని కోరారు. పింఛన్లను ఏ నిబంధనలూ లేకుండా అందించాలన్నారు. టీడీపీ తన మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేయాలని చూస్తే, అన్ని వర్గాల ప్రజల తరఫున పోరాటాలు చేస్తామన్నారు.
షరతుల్లేకుండా రుణాలు మాఫీ చేయాలి
Published Sun, Jun 15 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM
Advertisement