ప్రాథమిక స్థాయిలోనూ ప్రభుత్వ సిలబస్
కచ్చితంగా అమలు చేయాల్సిందే: కడియం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు జూన్ (వచ్చే విద్యా సంవత్సరం) నుంచి ప్రభుత్వం రూపొందించిన సిలబస్‌ను అమలు చేయాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టంచేశారు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియెట్ వరకు కచ్చితంగా ప్రభుత్వం సూచించే సిలబస్‌ను అమలు చేయాలని, లేదంటే ఆయా పాఠశాలలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇన్నాళ్లు ప్రైవేటు పాఠశాలలు 6 నుంచి 10వ తరగతి వరకు విద్యాశాఖ రూపొందించే సిలబస్‌ను అమలు చేస్తుండగా, ప్రాథమిక స్థాయిలో తమకు నచ్చిన పబ్లిషర్ పుస్తకాలతో బోధన కొనసాగిస్తుండటంతో ఈ నిర్ణయానికి వచ్చామన్నారు.
శుక్రవారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో వివిధ విద్యా కార్యక్రమాలు, బడ్జెట్‌పై సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2016-17 విద్యా సంవత్సర నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం రూపొందించే సిలబస్‌నే బోధించాలని, ప్రైవేటు పాఠశాలలకు ఇక గడువు ఇచ్చేది లేదన్నారు. ఇందుకు అవసరమైన పాఠ్య పుస్తకాలను కూడా మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. గత ఏడాది మార్కెట్‌లో 1.15 కోట్ల పుస్తకాలను ముద్రించి అందుబాటులో ఉంచగా, ఈసారి 1.55 కోట్ల పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. అలాగే ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా పాఠశాలల పని వేళలు పాటించడం, ఇష్టానుసారంగా తరగతులు నిర్వహించడం ఇకపై కుదరదన్నారు. విద్యాశాఖ అకడమిక్ కేలండర్ ప్రకారమే అన్ని ప్రైవేటు పాఠశాలలు కొనసాగాలన్నారు.
దుబారా తగ్గింపు
పుస్తకాలను ఇష్టానుసారంగా ముద్రించి, ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లే పరిస్థితులను నివారించామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈసారి కొత్తగా టెండర్లు పిలిచామని, తక్కువగా కోట్ చేసిన ధర ప్రకారం ముద్రణకు చర్యలు చేపడుతున్నందున ఈసారి రూ. 9 కోట్ల భారం తగ్గుతోందన్నారు. 25 శాతం నుంచి 30 శాతం వరకు పాఠ్యపుస్తకాల ధరలు తగ్గుతాయన్నారు.
త్వరలో అధ్యయన కమిటీ
రాష్ట్రంలో ప్రీప్రైమరీ స్కూళ్ల గుర్తింపునకు చర్యలు చేపడుతున్నందున వాటిల్లో ఇష్టానుసారంగా సిలబస్‌ను అమలు చేయకుండా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. విద్యాశాఖ నిర్ణయించే సిలబస్‌నే ఎల్‌కేజీ, యూకేజీ వంటి తరగతుల్లో అమలు చే సేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్‌కేజీ, యూకేజీలో అమలు చేస్తున్న సిలబస్‌ను అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీ వేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఫైలు పంపేందుకు సిద్ధమవుతోంది.