భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ భూదాన్, కాందిశీకుల భూముల అన్యాక్రాంతంపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని సీపీఐ రాష్ట్ర నాయకులు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గురువారం గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిసింది.
ఈ మూడు జిల్లాల్లో మొత్తం పదహారు ప్రాంతాల్లో వందల ఎకరాల్లో అన్యాక్రాంతమైన భూముల వివరాలను వారు గవర్నర్‌కు అందజేశారు. గవర్నర్‌ను కలసిన అనంతరం సీపీఐ నాయకులు మీడియాతో మాట్లాడారు. భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని చాడ అన్నారు. అన్యాక్రాంతమైన భూముల వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసి, పెద్ద చేపలను వదిలేస్తున్నారని చాడ ఆరోపించారు.