
కమ్యూనిస్టులు దేశద్రోహులు కారు: అసద్
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టులు దేశదోహ్రులు కారని ఆలిండియా మజ్లిస్ -ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీతో తమకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న జేఎన్‌యూ విద్యార్థి సంఘ నాయకులు మాత్రం దేశద్రోహులుగా వ్యవహరించరని ఆయన పేర్కొన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య ఒకవేళ జాతికి వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తే అభ్యంతకరమన్నారు. దేశంలో జర్నలిస్టులపై దాడులు జరగడం అమానుషమన్నారు. రోహిత్ దళితుడు కాదని, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య దేశద్రోహి అని పేర్కొంటున్న బీజేపీ, సంఘ్ పరివార్‌లు సర్టిఫికేట్ ఇచ్చే దుకాణాలేమైనా తెరిచారా? అని ప్రశ్నించారు. కేంద్రం భావోద్వేగాలను తెరపైకి తెచ్చి అసలు సమస్యలను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
భావోద్వేగాలతో సమస్యలు పక్కదారి
కేంద్రానికి పార్లమెంట్ సమావేశాలు సజావుగా నడిపించాలన్న ఉద్దేశం లేనట్లు కనిపిస్తోందని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు భావోద్వేగాల సమస్యలను లేవనెత్తి ప్రధాన సమస్యలు చర్చకు రాకుండా కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. దేశ ఆర్థికవ్యవస్థ దిగజారుతుందని, ఎగుమతి, దిగుమతులు తగ్గిపోయాయని, సరిహద్దుల్లో సైనికులు అమరులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ట్వీటర్ ఖాతాపై పరిశీలనేదీ?
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న హాఫీజ్ సయీద్ ట్వీటర్ ఖాతా ఒరిజనలా లేదా ఫేకా అని పరిశీలన జరిపి నిర్ధారించలేక పోయారని అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు.