
14న కాంగ్రెస్ తొలి జాబితా
♦ జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై టీపీసీసీ సమన్వయ కమిటీ నిర్ణయం
♦ 3 దశల్లో అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి దింపే అభ్యర్థుల తొలిజాబితాను ఈ నెల 14న విడుదల చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. సోమవారం టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సీనియర్ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టివిక్రమార్క, నంది ఎల్లయ్య, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీధర్‌బాబు, బలరాం నాయక్, దానం నాగేందర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపిక, డివిజన్ల వారీగా ప్రచార వ్యూహం, పార్టీ సీనియర్లకు పని విభజన తదితర అంశాలపై చర్చించారు.
అభ్యర్థుల ఎంపిక కోసం వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా స్వతంత్ర సర్వేలను నిర్వహించాలని, వాటి ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 14న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాలని... 15, 16 తేదీల్లో మరో రెండు జాబితాలను విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇక ముఖ్యనేతలంతా ఐక్యంగా ఉన్నట్లు పార్టీ శ్రేణులకు విశ్వాసం కల్పించాలని, వ్యక్తిగత విభేదాలతో పార్టీ ప్రయోజనాలకు నష్టం కలిగించకూడదని అభిప్రాయానికి వచ్చారు. దీనికోసం ఉమ్మడిగా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. గ్రేటర్ ఎన్నికల కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్, ఖైరతాబాద్, సనత్‌నగర్, ఎల్‌బీ నగర్ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో దిగ్విజయ్ ప్రసంగిస్తారు.