కొండంత దేవునికి కొండంత పత్రితో పూజ చేయలేకపోయినా, పరిపూర్ణ మనసుతో మదిలో తలచుకుంటే చాలునని నాయకులందరూ చదువుకున్నవారే. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు, నాయకులకు సహజంగా ఓటరే దేవుడు. ఓటరు దేవుడ్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలనే విషయంలో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పద్ధతిని అనుసరించడమూ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆనవాయితీగా వస్తోంది. గ్రామాల్లో అయితే ఒక ఓటరుపై ఒక అంచనా ఉంటుంది.
గ్రేటర్ ఎన్నికల్లో ఓటరు మనసును గెలుచుకోవడానికి మార్గం తెలియక చాలామంది అభ్యర్థులు అవస్థలు పడగా, కొందరైతే ఎదురుదెబ్బలు తిన్నారట. శివారుప్రాంతంలోని ఒక డివిజనులో రిటైర్డు మిలిటరీ ఆఫీసరును మచ్చిక చేసుకోవడానికి పోటీచేసిన అభ్యర్థి ఒకరు సాయంత్రం పూట వస్తానని టైం తీసుకుని కలిశారట.
ఎన్నికల్లో మద్దతుకోసం వట్టి చేతులతో పోవడం ఎట్లా అని ఒక మోస్తరు మందుబాటిల్ తీసుకుని వెళ్లాడట. పది నిమిషాలు మంచిచెడూ మాట్లాడిన తర్వాత ఈ అభ్యర్థి తీసుకుపోయిన బాటిల్‌ను టేబుల్ మీద పెట్టాడట. ఆ బాటిల్‌ను కింద నుంచి మీదకు చూసిన ఆ మిలిటరీ ఆఫీసరు తన పనిమనిషిని పిలిచి ఇంటిలో ఉన్న బాటిల్‌ను తెమ్మన్నాడట.
మిలిటరీ ఆఫీసరు తెచ్చిన చాలా ఖరీదైన మందుసీసాను పనిమనిషితో మూత తెరిపించి, పోటీచేస్తున్న అభ్యర్థి తెచ్చిన బాటిల్‌ను తాగుపో అని పనిమనిషికి ఇచ్చాడట. మద్దతు అడగడానికి వచ్చిన ఆ అభ్యర్థి మారుమాట్లాడకుండా మిలిటరీ అధికారి చెప్పిన మాటలు విని, పోసిన మందు తాగి బయటపడ్డాడట.