జైళ్ల శాఖ టర్నోవర్ రూ.216 కోట్లు
సగానికి తగ్గిన ఖైదీల మరణాలు: డీజీ వీకే సింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జైళ్ల శాఖ 2015 సంవత్సరంలో రూ.216.03 కోట్లు టర్నోవర్ సాధించినట్లు డెరైక్టర్ జనరల్ (డీజీ) వినయ్‌కుమార్ సింగ్ వెల్లడించారు. జైళ్ల శాఖకు ఒక్క రూపాయి నిధులు రాకపోయినా... తమ శాఖ ఆదాయం నుంచే ఖర్చులన్నీ పోను గతేడాది రూ.4.77 కోట్లు మిగులు సాధించినట్లు తెలిపారు. 2025 నాటికి రూ.100 కోట్ల లాభాలను ఆర్జించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. మంగళవారం జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంతో పోల్చితే జైళ్లలో ఖైదీల మరణాలు సగానికిపైగా తగ్గినట్లు చెప్పారు. 2013లో 53 మంది ఖైదీలు చనిపోగా, 2014లో 56 మంది చనిపోయారన్నారు.
2015లో 32 మంది వివిధ వ్యాధుల బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారన్నారు. ఖైదీల మరణాలను నివారించేందుకు మహాపరివర్తన్ పేరిట జైళ్లలో అనేక సంస్కరణలు చేపడుతున్నామని, ఫలితంగా జైలుకు వచ్చే ఖైదీల సంఖ్య కూడా భారీగా తగ్గిందని సింగ్ పేర్కొన్నారు. 2014లో రాష్ట్రంలోని అన్ని జైళ్లకు 94 వేల మంది ఖైదీలు రాగా, 2015లో 79,409 మంది వచ్చారన్నారు. వీరిలో శిక్ష పడిన వారు 3,926 మంది కాగా, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీల్లో 49,942 మంది పురుషులు, 25,541 మంది మహిళలు ఉన్నట్లు ఆయన చెప్పారు.