జైళ్లను సైనిక్ స్కూళ్లుగా మార్చడమే లక్ష్యం
జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్
వరంగల్: రాష్ట్రంలోని జైళ్లన్నింటినీ సైనిక్ స్కూళ్లుగా మార్చడమే జైళ్ల శాఖ లక్ష్యమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్(జైళ్లు) వీకేసింగ్ అన్నారు. వరంగల్ కేఎంసీలో సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో కుల, మత, ప్రాంతీయతత్వాలతో ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయన్నారు. సిటిజన్ ఫోరం ఏర్పడటంతోనే సరిపోదని డివిజన్, మండలంతోపాటు గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పడి ప్రజలను భాగస్వామ్యం చేసినప్పుడే బంగారు తెలంగాణ సుసాధ్యమవుతుందన్నారు. గతేడాది 80 వేల మంది ఖైదీలను అక్షరాస్యులుగా మార్చామన్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ఏమీ కేటాయించలేదన్నారు.
రెండేళ్లుగా జైళ్లశాఖను అవినీతి రహిత శాఖగా మార్చడం, చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తించిన ప్రభుత్వం జైళ్లలో మరిన్ని సౌకర్యాల కల్పనకు వచ్చే బడ్జెట్‌లో రూ.30 కోట్లు కేటాయిస్తోందన్నారు. సదస్సులో జైలు సూపరింటెండెంట్ ఎం.సంపత్, శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, సిటిజన్ ఫోరం అర్బన్ కమిటీ సభ్యులు పరశురాములు, గిల్దార్ సుల్తానా, బాలరాజు, నరేశ్, వీరభద్రరావు, మంజుల, రమాదేవి, ఉమేందర్, యాకుబ్‌పాషా పాల్గొన్నారు.