జైళ్లలో చికెన్ బిర్యానీ! | Prisons in the chicken biryani! | Sakshi
Sakshi News home page

జైళ్లలో చికెన్ బిర్యానీ!

Published Wed, Mar 2 2016 3:20 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

జైళ్లలో చికెన్ బిర్యానీ!

జైళ్లలో చికెన్ బిర్యానీ!

అధునాతన క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని జైళ్లశాఖ డీజీ ఉత్తర్వులు
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జైలు పేరు చెబితే ఠక్కున గుర్తుకొచ్చేది చిప్పకూడు! కానీ ఇకపై చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫ్రైడ్‌రైస్ సహా అన్నీ గుర్తుకొస్తాయి. ఇవన్నీ జైలు క్యాంటిన్‌లో ఖైదీలకు అందుబాటులోకి రాబోతున్నాయి. బయట హోటల్ మాదిరిగా డబ్బులు చెల్లిస్తే చాలు.. ఉదయం ఇడ్లీ, దోశ, పూరి, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఇష్టమైన చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్.. వగైరా లాగించేయొచ్చు. ఈ మేరకు రాష్ట్ర జైళ్ల డీజీ వీకే సింగ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

 ఈ ఉత్తర్వులు ఎందుకంటే...
 మంచి భోజనం కోసం ఖైదీలు, రిమాండ్  ఖైదీలు అల్లాడిపోతున్నారు. జైలు కూడు తినలేక పస్తులుంటూ ఎందరో అనారోగ్యం పాలవుతున్నారు. కొందరైతే నచ్చిన తిండి కోసం జైలు సిబ్బందికి వేలకు వేలు లంచాలిచ్చి బయట్నుంచి చాటుమాటుగా తెప్పించుకుని తింటున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు జైళ్ల శాఖ డీజీ జైళ్లలో అదునాతన క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఖైదీలు ఇష్టమైన తిండి కోసం జైలు సిబ్బందికి లంచాలిచ్చే పద్ధతికి స్వస్తి పలకొచ్చని ఆయన భావిస్తున్నారు. దీనికితోడు క్యాంటీన్ల ద్వారా వచ్చే ఆదాయంతో జైళ్లను ఆర్థికంగా బలోపేతం చేయొచ్చని భావిస్తున్నారు.

 ఒక్కో ఐటమ్‌కు ఒక్కో రేటు!
 క్యాంటీన్‌లో ఆహార పదార్థాలకు ఒక్కో ఐటమ్‌కు ఒక్కో ధర నిర్ణయిస్తారు. ఆహార పదార్థాలకయ్యే ఖర్చు, క్యాంటీన్ నిర్వహణ ఖర్చులపై 20 శాతం లాభం వేసుకొని ఈ ధరలు నిర్ణయించాలని జైళ్లశాఖ డీజీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చిన ఆదాయాన్ని జైళ్ల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. జైలు క్యాంటీన్‌లో ఇష్టమైన ఆహారం తినే సదుపాయం విదేశాల్లో ఎప్పట్నుంచో అమలవుతోంది. మన రాష్ట్రంలో తొలిసారిగా ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఇప్పటికే కరీంనగరం జిల్లా జైలులో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఖైదీల నుంచి అనూహ్య స్పందన రావడంతో త్వరలో పూర్తిస్థాయిలో అధునాతన క్యాంటీన్‌ను ఏర్పాటు చేసేందుకు జైలు సూపరింటెండెంట్ శివకుమార్ సిద్ధమవుతున్నారు.

 ఖైదీల సంక్షేమం కోసమే: శివకుమార్, జైలు సూపరింటెండెంట్, కరీంనగర్
 జైళ్లశాఖ డీజీ ఆదేశాల మేరకు జిల్లా జైలులో ప్రయోగాత్మకంగా చికెన్, ఎగ్‌తో చేసిన ఆహార పదార్థాలను ఖైదీలకు అందించాం. ఎగ్‌ఫ్రైడ్ రైస్, ఎగ్‌కర్రీల ధర రూ.40. ఖైదీల నుంచి మంచి స్పందన రావడంతో పూర్తిస్థాయిలో మెనూలోని ఆహార పదార్థాలన్నీ అందించేందుకు సిద్ధమవుతున్నాం. ఖైదీల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. క్యాంటీన్ నిర్వహణను ఐదుగురు ఖైదీలకు కేటాయించాం.
 
 ఇదీ జైలు క్యాంటీన్ మెనూ ఉదయం: ఇడ్లీ, దోశ, పూరి, వడ, ఉప్మా
 సాయంత్రం: చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్‌రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్‌బోండా, చపాతీ.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement